Minister Gudivada Amarnath: ముఖం మీదే చెప్పేసిన హై కమాండ్.. గుడివాడ అమర్నాథ్ కు దారేది?

గుడివాడ అమర్నాథ్ వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కేసరికి ఆయన ఉబ్బి తబ్బిబ్బయ్యారు. జగన్ పట్ల భక్తి ప్రపత్తులతో వ్యవహరించారు.

Written By: Dharma, Updated On : January 5, 2024 9:05 am

Minister Gudivada Amarnath

Follow us on

Minister Gudivada Amarnath: గుడివాడ అమర్నాథ్ విషయంలో వైసిపి హై కమాండ్ మెత్తబడిందా? ఆయన కన్నీటికి కరిగిపోయిందా? ప్రత్యామ్నాయ అవకాశాలు ఇస్తామని బుజ్జగించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంత్రి అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గానికి మలసాల భరత్ కుమార్ అనే నేతను ఇన్చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. అనకాపల్లి నుంచి తప్పించిన అమర్నాథ్ మాత్రం ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. దీంతో భరత్ కుమార్ పరిచయ వేదికపై మంత్రి అమర్నాథ్ వెక్కి వెక్కి ఏడ్చారు. అనకాపల్లి ని విడిచిపెట్టడం బాధగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

గుడివాడ అమర్నాథ్ వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కేసరికి ఆయన ఉబ్బి తబ్బిబ్బయ్యారు. జగన్ పట్ల భక్తి ప్రపత్తులతో వ్యవహరించారు. అంతటితో ఆగకుండా రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. చంద్రబాబుతో పాటు పవన్ లపై వ్యక్తిగత విమర్శలు చేసేవారు. అటువంటి నేతను తప్పించడంతో టిడిపి, జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో రెచ్చిపోయాయి. ఈ పరిణామాలను గమనించిన గుడివాడ అమర్నాథ్ ఏకంగా ఓ సభలో కన్నీటిని దిగమింగుతూ మాట్లాడడం వైసీపీలో కలవరానికి కారణమైంది. ముందు రోజు చేర్పులు మార్పులపై అమర్నాథ్ సానుకూలంగా మాట్లాడారు. తరువాత రోజు ఆయన సీటును మార్చడంపై ఆశ్చర్యానికి గురయ్యారు. మనస్థాపం చెందినట్లు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అమర్నాథ్ ఇంటికి వెళ్లి ఓదార్చడం ప్రాధాన్యత సంతరించుకుంది.

విశ్వసనీయ సమాచారం మేరకు విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి గుడివాడ అమర్నాథ్ ను పోటీలో పెడతామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఇప్పటికే విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంపీ అభ్యర్థిగా కొత్త ముఖాన్ని తెరపైకి తేవాలని వైసిపి భావిస్తోంది. చాలా రకాల పేర్లు వినిపించాయి. కానీ సరైన అభ్యర్థి వారికి తారస పడలేదు. దీంతో గుడివాడ అమర్నాథ్ కు ఎంపీ టికెట్ ఇవ్వాలని వైసిపి హై కమాండ్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వై వి సుబ్బారెడ్డి అమర్నాథ్ కు చెప్పినట్లు సమాచారం. విపక్షాలపై దూకుడుగా ఉన్న తనలాంటి వారి విషయంలో హై కమాండ్ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుందని అమర్నాథ్ గుర్తుచేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఎంపీగా పోటీ చేసేందుకు గుడివాడ అమర్నాథ్ విముఖత చూపుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆయన చోడవరం లేదా పెందుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని బలంగా విశ్వసిస్తున్నారు. అయితే చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ, పెందుర్తి నుంచి అదీప్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో మార్చకపోవచ్చు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గుడివాడ అమర్నాథ్ కు విశాఖపట్నం తప్పించి మరి ఏ ఇతర ఆప్షన్ లేదు. హై కమాండ్ సైతం ఈ విషయంలో అమర్నాథ్ కు తేల్చి చెప్పినట్లు సమాచారం. చేస్తే విశాఖపట్నం నుంచి పోటీ చేయండి.. లేకపోతే ఎన్నికల క్యాంపెయినర్ గా ఉండండి అని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. కాపు ఈక్వేషన్ లెక్కపెట్టి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని ఒత్తిడి పెంచుతోంది. అయితే అమర్నాథ్ మాత్రం పోటీ చేసేందుకు భయపడుతున్నారు. అసెంబ్లీ వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ హై కమాండ్ మాత్రం ఒప్పుకోలేదు. ఇటువంటి సమయంలో గుడివాడ అమర్నాథ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో నని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.