YS Sharmila: మీడియా అనేది జనం నాడిని పసిగట్టాలి. జనం అభిప్రాయంతో ఏకీభవించాలి. జనం కష్టాలను ఏ కరువు పెట్టాలి. జనం బాధలు ఏంటో తెలుసుకోవాలి. దానికి పరిష్కార బాధ్యతను కూడా జనం ద్వారానే చెప్పించాలి. అప్పుడే మీడియా అనేది జనం ప్రేమను పొందగలుగుతుంది. జనం నోళ్ళల్లో నానుతుంది. అంతేగాని మీడియా తనకున్న రాజకీయ అభిరుచిని జనం మీద బలంగా రుద్దితే.. జనం కచ్చితంగా అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్త పరచాలని కోరుకుంటే.. మొదటికే మోసం వస్తుంది. అప్పుడు ఆ మీడియా ఒక వర్గానికి మాత్రమే పరిమితం అవుతుంది. తెలుగు నాట అలాంటి మీడియా పత్రికలు, చానల్స్ కొన్ని ఉన్నాయి. అవి మొదటినుంచి కూడా ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. అంటే మిగతా పార్టీలకు లేవా? అంటే ఉన్నాయి. అవి ఉన్నప్పటికీ.. పక్తు ఆ పత్రికలు, చానల్స్ వ్యవహరించే తీరు అంతకుమించి అనే విధంగా ఉంటుంది. పైగా ఆ పత్రికలు, చానల్స్ ఆ పార్టీ కంటే ఎక్కువగా స్పందిస్తాయి. అంతేకాదు వ్యక్తిత్వ హనానికి కూడా వెనుకాడవు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి తో విభేదాల తర్వాత వైయస్ షర్మిల సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాదనుకొని తెలంగాణ రాష్ట్రంలో తన తండ్రి పేరుతో పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. ఇదే సమయంలో అధికార పార్టీ నాయకుల మీద తీవ్ర విమర్శలు చేశారు. సరే ఆమె పార్టీ పెట్టింది కాబట్టి.. మీడియా ఆటెన్షన్ కోసం అలా చేస్తోంది అని అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ ఓ వర్గం మీడియా మాత్రం ఆమె రాజకీయ ప్రవేశం పట్ల రకరకాల వ్యాఖ్యానాలు చేసింది. ఆమె జగన్ వదిలిన బాణమని, తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ గెలుపు కోసం కృషి చేస్తుందని, కాంగ్రెస్ విజయవకాశాలను దెబ్బతీస్తుందని అని రాసుకొచ్చింది. కొద్దిరోజుల తర్వాత ఆమె బిజెపి వదిలిన బాణమని, తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త అలజడులు సృష్టించేందుకు ఆమె కంకణం కట్టుకున్నారని రాసింది. మరికొంత కాలానికి ఆమె తన అన్నకు అనుకూలంగా రాజకీయాలు చేస్తోందని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ సీమాంధ్ర పాలనను ఆమె తెరపైకి తెస్తుందని రాసుకొచ్చింది.
అంటే ఆ మీడియా రకరకాల వక్రీకరణలకు దిగింది. షర్మిలకు గతంలో ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వని ఆ మీడియా.. పతాక స్థాయి వార్తలు అచ్చేసినప్పుడే ఆ మీడియా ఉద్దేశం ఏమిటో అర్థమైంది. అంతేకాదు ఒకడుగు ముందుకేసి ఆమె సోదరుడు జగన్ మీద రకరకాల వార్తలు ప్రచురించింది. తీరా మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. తను పోటీ చేయడం లేదని తేల్చి చెప్పేసింది. అంతేకాదు త్వరలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని ప్రకటించింది. అంతే కాదు ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తను బాధ్యతలు స్వీకరిస్తానని కూడా ప్రకటించింది. తన ప్రాముఖ్యతను గుర్తించి కాంగ్రెస్ పార్టీ తనకు ఈ అవకాశాన్ని కల్పించిందని ఆమె వివరించింది. అంటే ఇప్పుడు ఆమె ఎవరు వదిలిన బాణం? తన అన్నకు వ్యతిరేకంగానే ఏపీలో ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆమె ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టు? మొన్నటిదాకా చిలువలు పలువలు లేకుండా వార్తలు రాసిన ఆ మీడియా.. ఇప్పుడు ఎలాంటి వార్తలు రాస్తుంది? గతంలో ఆ మీడియా రాసిన వార్తలకు కట్టుబడి ఉంటుందా? ఇప్పటికైనా ఆమె ఎవరు వదిలిన బాణమో చెప్పగలుగుతుందా? అందుకే పత్రికలు పెట్టుబడిదారుల పుత్రికలను వెనుకటికి పెద్దలు ఊరకనే అనలేదు.