Nara Lokesh Mangalagiri: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ చేసింది అదే. మంగళగిరిలో గెలిచి అదే నియోజకవర్గాన్ని శాశ్వతంగా మలుచుకోవాలన్న ఆలోచనతో ముందడుగు వేస్తున్నారు లోకేష్. అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు. ఏపీలో నెంబర్ వన్ నియోజకవర్గం గా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. అసలు తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని పెద్ద సాహసమే చేశారు. అటువంటి చోట ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడిగా, సిట్టింగ్ మంత్రిగా ఉంటూ ఓడిపోయారు. అదే నియోజకవర్గ నుంచి 90 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి రికార్డ్ సృష్టించారు.
* కేవలం రెండుసార్లు మాత్రమే..
మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు చాలా తక్కువ. ఆ పార్టీ ఆవిర్భవించిన తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది. అటువంటి నియోజకవర్గాన్ని లోకేష్ ఎంపిక చేసుకోవడం సాహసమే. అయితే ఓటమి ఎదురైన తర్వాత లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని విడిచిపెట్టలేదు.. సొంత డబ్బులు పెట్టి ప్రత్యేకంగా అభివృద్ధి పనులు చేశారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అక్కడ రాజకీయాలనే మార్చేశారు. ప్రతి పేదవాడికి సాయం చేశారు. అసలు అక్కడ ఆయనకు కుల బలం లేదు. పార్టీ బలం లేదు. అటువంటి చోట ప్రజల మనసును గెలిచేందుకు ఐదేళ్లపాటు అహర్నిశలు శ్రమించారు. ఆయన సేవలను గుర్తించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు.
* శరవేగంగా అభివృద్ధి..
మంగళగిరిని శాశ్వత నియోజకవర్గంగా మార్చుకోవాలని లోకేష్ అడుగులు వేశారు. ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలే మారిపోతున్నాయి. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రధానంగా చేనేత కార్మికులు అధికం కావడంతో వారి కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో చేనేతశాలను ఏర్పాటు చేశారు. అమరావతి రాజధాని ప్రాంతం కావడంతో రహదారులను అనుసంధానం చేస్తున్నారు. నిత్యం గ్రీవెన్స్ సెల్ లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలోనే ఒక రోల్ మోడల్ గా మంగళగిరిని తీర్చిదిద్దే పనిలో ఉన్నారు లోకేష్. రాష్ట్ర ప్రభుత్వపరంగా భారీగా నిధులు వెచ్చించి పనులు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సైతం ఏర్పాటు చేయించి మంగళగిరిని జాతీయస్థాయిలో కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
