Mana Mitra Whatsapp Governance
Mana Mitra Whatsapp Governance: ఏపీలో( Andhra Pradesh) టిడిపి కూటమి ప్రభుత్వం సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళుతోంది. ప్రజలకు మెరుగైన పాలన అందించాలని భావిస్తోంది. ముఖ్యంగా పాలనను మరింత సరళతరం చేయాలని భావిస్తోంది. క్షణాల్లో పౌర సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా వాట్సాప్ మన మిత్ర సేవలు పేరిట వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. 161 రకాల పౌర సేవలతో మొదలైన వాట్సాప్ మనమిత్ర తాజాగా 200 సేవలకు విస్తరించింది. త్వరలో మరిన్ని సేవలను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తోంది. పౌర సేవలను సులభతరంగా ప్రజలకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది వాట్సాప్ గవర్నెన్స్ ను. విజయవంతంగా వాటిని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.
Also Read: బొమ్మల పిచ్చితో దేన్నీ వదల్లే.. జగన్ పై లోకేష్ సంచలన కామెంట్స్!
* సేవలు సులభతరంగా..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సేవలకు ప్రజలు కార్యాలయాలకు తిరగకుండా ఉండేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను రూపొందించింది. అందులో భాగంగా జనవరి 30న మంత్రి లోకేష్ 161 సేవలతో దీనిని ప్రారంభించారు. అయితే 50 రోజుల్లోనే 200 సేవలు అందించే అద్భుతమైన మైలురాయి సాధించింది ఈ విధానం. వాట్సాప్ ద్వారా పౌర సేవలను సమర్ధవంతంగా, సులభతరంగా అందుబాటులోకి తేవడం దీని ముఖ్య ఉద్దేశ్యం. గత ఏడాది అక్టోబర్ 22న ఢిల్లీలో మంత్రి లోకేష్ వాట్సాప్ ను నిర్వహించే మెటా ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారితో ఒప్పందం చేసుకున్నారు.
* స్మార్ట్ ఫోన్ తో అన్నీ
చేతిలో స్మార్ట్ ఫోన్( smartphone) ఉంటే చాలు అన్ని రకాల సేవలను పొందేలా దీనిని క్రియేట్ చేశారు. క్షణాల్లోనే రవాణా, ఆలయ దర్శనాలు, రైల్వే, విద్యుత్, పోలీస్, ఆరోగ్య వంటి 200 సేవలను పొందవచ్చు. కార్యాలయాల చుట్టూ తిరగకుండా ధ్రువీకరణ పత్రాలను సైతం పొందవచ్చు. మన మిత్ర 9552300009 కు వాట్సాప్ సందేశం పంపడం ద్వారా 200 రకాల పౌర సేవలను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల 10, ఇంటర్ విద్యార్థులు తమ హాల్ టికెట్లను సైతం మనమిత్ర వాట్సాప్ ద్వారా పొందారు.
* చాలా సులువుగా సేవలు
సాధారణంగా ప్రజలు సుదూర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను( temples) సందర్శిస్తుంటారు. పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వెళుతుంటారు. అటువంటివారు రైల్వే, బస్సు టికెట్ల కోసం యాతన పడుతుంటారు. ఇటువంటివి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ రికార్డులు, ఆదాయ ధ్రువీకరణ వంటి సర్టిఫికెట్లు కూడా సులభంగా పొందవచ్చు.
* మూడు ప్రాథమిక నమూనాల్లో
వాట్సాప్ బిజినెస్ సర్వీస్ డెలివరీ ప్లాట్ ఫామ్ గా( WhatsApp business Service Delivery platform) పలు రకాల పౌర సేవలను ప్రజలకు అందిస్తోంది మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్. మూడు ప్రాథమిక నమూనాల్లో ఏపీ ప్రభుత్వానికి డెలివరీ ప్లాట్ఫామ్ గా వాట్సాప్ సేవలను అందించే లక్ష్యంతోనే మెటా సమస్త తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగానే తొలి విడతలో పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో వాణిజ్య రంగంలో డోర్ డెలివరీ సాయం కూడా అందుబాటులోకి రానుంది. అటు తరువాత ప్రభుత్వ శాఖల అంతర్గత కార్యకలాపాలకు సైతం దీనిని వినియోగిస్తారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎటువంటి అవాంతరాలు లేకుండా వేగవంతంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందనున్నాయి. అదే సమయంలో పౌరుల సమాచారం గోప్యతకు పూర్తి భరోసా ఇస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది.