Padayatra: నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు కొన్ని నెలలుగా దీక్షలు చేస్తున్న సంగతి అందరికీ తెల్సిందే. జగన్ సర్కారు అమరావతి రాజధాని అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన రైతులంతా మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ అనే పేరుతో తమ పోరాటానికి అన్ని జిల్లాల ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అమరావతి రైతుల సాగిస్తున్న మహాపాదయాత్ర తుది ఘట్టానికి చేరుకుంది. ఇదే సమయంలో హైకోర్టులో అమరావతి రైతుల భారీ బహిరంగ సభకు సంబంధించిన పిటిషన్ హైకోర్టులో విచారణ జరుగనుంది. అడుగడుగునా పోలీసులు రైతుల పాదయాత్రకు అడ్డుపడుతున్న తరుణంలో రైతులు చేపట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
ఈ విషయంపై అమరావతి రైతులు హైకోర్టును నేడు ఆశ్రయించనున్నారు. ఈనెల 17న నిర్వహించే భారీ బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని సోమవారం రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. దీనిపై నేడు విచారణ జరుగనున్న నేపథ్యంలో కోర్టు సభకు అనుమతి ఇస్తుందా? లేదా అన్న ఉత్కంఠత సర్వత్రా నెలకొంది.
మరోవైపు నేటితో పాదయాత్ర 43వ రోజుకు చేరుకుంది. సోమవారం నాడు అమరావతి ప్రాంత రైతులు రేణిగుంట నుంచి పాదయాత్రను ప్రారంభించి 12కిలోమీటర్ల మేర తమ నడకను కొనసాగించనున్నారు. నేటితో పాదయాత్ర తిరుపతికి చేరుకోనుంది. ఈరోజు పాదయాత్రకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు.
ఇక తిరుపతిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు అందరూ ఆహ్వానితులేనని అమరావతి రైతులు చెబుతున్నారు. అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించటం వల్ల ఎలా అభివృద్ధి జరుగుతుందో సభా వేదికగా వెల్లడిస్తామన్నారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా భారీ బహిరంగ సభకు అందరినీ ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.
Also Read: పడిన చోటే లేచేందుకు.. రంగంలోకి రాహుల్
డిసెంబర్ 15న ఉదయం 175నియోజకవర్గాల్లో పాదయాత్రకు మద్దతుగా సంఘీభావ యాత్రలు చేయనున్నట్లు తెలిపారు. ఆయా నియోజకవర్గాలలో మహాత్ముల విగ్రహాలకు నివాళులర్పించి ఏపీ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలే ఆకాంక్షను వ్యక్తం చేయనున్నామని వెల్లడించారు. అలాగే తాము ఇతర ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకం కాదని అమరావతి రైతులు స్పష్టం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే అమరావతి రైతులు చేపడుతున్న మహా పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వృత్తి, వ్యాపార సంఘాలు మాత్రమే కాకుండా వైసీపీ మినహా మిగతా రాజకీయ పార్టీల నేతలు పాదయాత్రకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ప్రవాసాంధ్ర రైతులు కూడా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ విరాళాలను అందిస్తున్నారు.
Also Read: మూడో ప్రపంచ యుద్ధానికి రష్యా, ఉక్రెయిన్లు ఆజ్యం పోస్తున్నాయా..?