Madanapalle: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. కార్యాలయంలో కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి. సాధారణ ప్రమాదంగా అంతా భావించారు. కానీ దీని వెనుక కుట్ర కోణం ఉందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రధానంగా 22 ఏ సెక్షన్ లో మంటలు రాజుకున్నాయి. 25 విభాగాలకు సంబంధించి ఫైళ్లు బూడిదయ్యాయి. కొన్ని ఫైళ్ళు కుప్పగా పోసి నిప్పు పెట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారం చేతులు మారిన నేపథ్యంలో ఉద్దేశపూర్వక చర్యగా అనుమానాలు ఉన్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హెలిక్యాప్టర్ లో అప్పటికప్పుడు డిజిపి తో పాటు సిఐడి ఎడిజి వెళ్లారు. ప్రధానంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
* అడ్డగోలుగా భూ కేటాయింపులు
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లుగా రాష్ట్రానికి సీఎం జగన్ కాగా.. రాయలసీమను మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాసించారు. కానీ ఈ ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో బయటపడ్డారు పుంగనూరు నుంచి. అయితే ఐదేళ్ల వైసిపి పాలనలో పెద్దిరెడ్డి చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్న ఆరోపణలు ఉన్నాయి. పుంగనూరు మండలంలో 900 ఎకరాల భూములను మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పట్లో కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాటిని రద్దు చేసింది. ఈ ఫైళ్లు ఇంకా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఉన్నాయి. పెద్ద తిప్ప సముద్రం మండలంలో కర్ణాటక కు చెందిన మఠం భూములు 500 ఎకరాలకు పైగా ఉన్నాయి. వీటిని పెద్దిరెడ్డి అనుచరులు ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లె రింగ్ రోడ్డులో 20 కోట్ల విలువచేసే రెండున్నర ఎకరాల భూమి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరు మీద రిజిస్టర్ అయ్యింది. ఈ భూమి ఎన్ఓసి విషయంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లి మండలం వలస పల్లె పరిధిలో 2.75 ఎకరాల భూమి ఉంది.దీంట్లో సైతం అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కురబలకోట మండలంలో అత్యంత విలువైన భూములను పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా స్వాధీన పరుచుకుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
* డికేటి భూముల కోసమేనా
వైసిపి ప్రభుత్వ హయాంలో డికేటి భూముల యాజమాన్య హక్కు చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ద్వారా పెద్దిరెడ్డి తో పాటు ఆయన అనుచరులు వందల ఎకరాలను తప్పుడు డాక్యుమెంట్లతో నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. మూడు రోజుల కిందటే రాష్ట్ర ప్రభుత్వం రిజిస్టర్ కాకుండా నిలుపుదల చేసింది. ఈ భూములకు సంబంధించి ఫైల్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అగ్ని ప్రమాదం జరగడం, కీలక ఫైళ్ళు తగలబడిపోవడం అనుమానాలకు తావిస్తోంది.
* ఇది దుశ్చర్య: డిజిపి
ఇది అగ్ని ప్రమాదం కాదని.. దుశ్చర్య అని అనుమానాలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు.. డిజిపి ద్వారకా తిరుమల రావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నర్ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఇది ప్రమాదం కాదని.. ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటనగా ఉందని డిజిపి మీడియాకు వివరించారు. 25 విభాగాలకు చెందిన రన్నింగ్ ఫైళ్లు కాలిపోయినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు కొంతమంది సిబ్బంది పాత్ర పై విచారణ చేపడుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Madanapalle sub collector office is behind the fire big sketch the government is serious
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com