Liquor Scam In AP: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు రేపింది. ఇప్పటివరకు పాత్రధారులు మాత్రమే అరెస్టు అయ్యారు. అసలు సూత్రధారి పేరు బయటకు రావడం లేదు. అయితే స్పష్టమైన ఆధారాలు దొరికాయి కానీ.. కొన్ని రకాల కారణాలతో విడిచిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పరిస్థితి చూస్తుంటే మాత్రం వచ్చే ఎన్నికల వరకు మద్యం కుంభకోణం అలానే కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో పట్టుబడిన నిందితులు మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన ఆస్తులు అటాచ్ అవుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు అటాచ్ అయ్యాయి. అయితే ఈ ఇద్దరే కాదు ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి నిందితుడి ఆస్తులు అటాచ్ అవుతుండడం విశేషం. అయితే వారి వ్యక్తిగత ఆస్తుల జోలికి పోవడం లేదు. కేవలం మద్యం కుంభకోణంలో కమీషన్ల రూపంలో వచ్చిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తిని మాత్రమే అటాచ్ చేస్తున్నారు. కేవలం కమిషన్ల రూపంలో వందల కోట్లు వస్తే.. మరి అసలు సూత్రధారి కి ఎంత చేరిందో అర్థం అవుతుంది. అందుకే ఈ కేసు మరింత లోతుగా కొనసాగితే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే.
* ఆస్తుల అటాచ్..
ఈ కేసులో అప్పటి సీఎం ఓ అధికారి ధనంజయ రెడ్డి( Dhananjay Reddy ), ఆపై జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కూడా అరెస్టయ్యారు. ఇందులో కృష్ణమోహన్ రెడ్డి తెలంగాణలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. తాజాగా ఆయన ఆస్తులను సైతం అటాచ్ చేసింది. త్వరలో ధనుంజయ రెడ్డి ఆస్తులు సైతం అటాచ్ అవుతాయని సమాచారం. కేవలం ఆస్తులుగానే కాదు బంగారం, ఇతరత్రా బహుమతుల రూపంలో సైతం కమీషన్లు దండుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపితే కుంభకోణం ఏమి ఉంటుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా ఈజీగా తీసుకుంది. అనుకూల మీడియాతో పాటు విశ్లేషకులు సైతం అలానే చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆస్తుల అటాచ్ చూస్తుంటే మాత్రం పరిస్థితి చేయి దాటుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనతో ఉంది.
* లోతైన దర్యాప్తు..
ఎవరు అవునన్నా కాదన్నా అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మద్యం కుంభకోణంలో( liquor scam) అరెస్ట్ అయిన నిందితుల రిమాండ్ రిపోర్టు పెట్టిన ప్రతిసారి అంతిమ లబ్ధిదారుడి పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతానికి చుట్టూ గొయ్యిని తవ్వారు. చివరకు కచ్చితంగా అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేల్చనున్నారు. అయితే మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించగలిగారంటే దర్యాప్తు ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం అవుతోంది. కచ్చితంగా అంతిమ లబ్ధిదారుడికి ఎంత చేరింది? ఎలా చేరింది? ఎవరి ద్వారా చేరింది? అనేది కూడా దర్యాప్తు బృందం ఇప్పటికే గుర్తించగలిగి ఉంటుంది.