Legislative Council AP: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ఎమ్మెల్సీల రాజీనామా వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వారి రాజీనామాలు విషయంలో కోర్టు నాలుగు వారాల పాటు గడువు విధించింది. జయ మంగళం వెంకట్రమణ కోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు తీర్పు వచ్చింది. దీంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం శాసనమండలి చైర్మన్ పై ఏర్పడింది. గత ఏడాది కాలంగా ఎమ్మెల్సీల రాజీనామా వ్యవహారం నలుగుతూనే ఉంది. వైసీపీ రాజకీయ అవసరాల కోసం శాసనమండలి అవసరం. చైర్మన్ మోసేన్ రాజు ఆ పార్టీకి చెందిన నేత కావడంతో హై కమాండ్ నుంచి ఇంతవరకు ఎమ్మెల్సీల రాజీనామా పై ఆదేశాలు రాలేదు. దీంతో చైర్మన్ సైతం ఆ రాజీనామాలను ఆమోదించలేదు. అయితే ఇదే శాసనమండలిని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. ఇప్పుడు అదే శాసనమండలి ఆయనకు అక్కరకు వస్తోంది.
* ఏడాది కిందట రాజీనామా..
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. కర్రీ పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జయ మంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్, జాకీయా ఖానం తదితర ఎమ్మెల్సీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. అయితే రాజీనామా ఆమోదానికి నోచుకోకపోవడంతో వారు తమకు నచ్చిన కూటమి పార్టీల్లో చేరారు. అయితే ఇందులో జనసేనలో చేరిన జయ మంగళం వెంకటరమణ కోర్టును ఆశ్రయించారు. నాలుగు వారాల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే రాజీనామాలను ఆమోదించిన మరుక్షణం మరికొంతమంది రాజీనామా చేసే అవకాశం ఉంది. అదే జరిగితే శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోయినట్టే.
* అప్పట్లో రద్దు చేయాలని ప్రతిపాదన..
ఇదే శాసనమండలిని జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) వ్యతిరేకించారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 151 సీట్లతో ఘనవిజయం సాధించింది. అయితే అప్పటికే తెలుగుదేశం పార్టీకి శాసనమండలిలో బలం ఉంది. ఆ పార్టీ నేత మండలి చైర్మన్ గా ఉండేవారు. కీలక బిల్లులతో పాటు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలు చెప్పేది. బిల్లులను అడ్డగించేది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఏకంగా శాసనమండలిని రద్దు చేయాలని కోరుతూ కేంద్రానికి నివేదిక ఇచ్చారు. అయితే అప్పట్లో కేంద్రం దీనికి సమతం తెలపలేదు. అప్పట్లో కేంద్రం అనుమతి ఇచ్చి ఉంటే ఇప్పటికే రద్దు జాబితాలో శాసనమండలి చేరిపోయేది.
* కోర్టు ఆదేశాలు కీలకం
2024 ఎన్నికల్లో తెలుగుదేశం( Telugu Desam) పార్టీ కూటమికి అనుకూలంగా పనిచేసారని రఘురాజు అనే వైసిపి ఎమ్మెల్సీ ఫై వేటు వేశారు చైర్మన్ మోసేన్ రాజు. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఉన్న రఘురాజు పై వేటు పడడంతో ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికకు సిద్ధపడింది. కానీ కోర్టు స్టే విధించడంతో ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. అయితే స్వయంగా ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే మాత్రం చైర్మన్ ఆమోదం తెలపడం లేదు. అయితే ఇప్పుడు జయ మంగళం వెంకటరమణ కోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు ఇచ్చే ఆదేశాలు కీలకంగా మారనున్నాయి. ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం తెలిపితే మాత్రం శాసనమండలిలో మిగతా ఎమ్మెల్సీలు సైతం రాజీనామా బాటకు అవకాశం ఉంది. అదే జరిగితే శాసనమండలి సైతం టిడిపి కూటమికి చిక్కినట్టే.