Legal recognition for Amaravati: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ మరో సంక్లిష్ట పరిస్థితి ఎదుర్కోక తప్పదు. మరో వారం రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. అనేక బిల్లులు ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. అయితే బిల్లుల విషయంలో బిజెపి పట్ల ఎప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుకూలంగానే ఉంటుంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించే అమరావతి అంశంపై పార్లమెంట్లో చర్చ జరగనుంది. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. లోక్సభ తో పాటు రాజ్యసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యుల బలం ఉంది. ఆ పార్టీ స్టాండ్ చెప్పాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో..
అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిధుల సమీకరణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం సైతం 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి నిధులు సర్దుబాటు చేసింది. అయితే గత అనుభవాల దృష్ట్యా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని రైతులు కోరుతూ వచ్చారు. ఏపీ ప్రభుత్వం సైతం ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేస్తోంది. అయితే రాజధానిల విషయంలో నోటిఫై చేయాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతున్నా.. ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా.. పరిగణలోకి తీసుకోవాలని కూటమి ప్రభుత్వం కోరింది. అందుకే ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లును పార్లమెంటులో పెడతారని తెలుస్తోంది. అయితే దీనిపై వైసీపీ స్టాండ్ ఏంటనేది తేటతెల్లం కానుంది.
ఆది నుంచి వ్యతిరేకత..
అమరావతి పై ఆది నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) వ్యతిరేక భావనతోనే ఉన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని వ్యాఖ్యానించేవారు. అసలు రాజ్యాంగం లో రాజధాని అనే పదమే లేదని తేల్చేశారు. ఐదేళ్లపాటు అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. మూడు రాజధానులు అంటూ హడావిడి చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు కూడా అదే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. నది చెంతనే కట్టారని.. ముంపు ప్రాంతంలో అమరావతి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారు. అయితే ఇప్పుడు పార్లమెంటులోనే నేరుగా వైసీపీ అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది అమరావతిపై. ఇప్పటికే వైసీపీకి వ్యతిరేకంగా అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తోంది టిడిపి కూటమి. తప్పకుండా ఈ విషయంలో ఏదో ఒకటి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఉంది. మరి ఎలా స్పందిస్తుందో చూడాలి.