Janasena: అంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జనసేనకు అభ్యర్థులు కరువయ్యారా.. ఏపీని వైసీపీ ముక్త రాష్ట్రంగా మారుస్తానన్న పవన్‌కు వైసీపీ అభ్యర్థులకు ఎదురొడ్డి నిలబడే నేతలే దొరకడం లేదా..అంటే అవుననే సమాధానం వస్తోంది జనసేన నాయకుల నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, టీడీపీ నుంచి, వైసీపీ నుంచి జనసేనలో చేరిన నేతలను అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. దీంతో పదేళ్లుగా పార్టీలో ఉంటూ.. పార్టీ బలోపేతానికి కృషి చేసిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అరువు తెచ్చి అభ్యర్థులుగా ప్రకటన..
జనసేన అంటేనే ఓ విచత్ర పార్టీగా ఇప్పటికే ముద్ర ఉంది. దానిని నిజం చేసేలా జనసేనాని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. దీంతో జన సైనికులు అధినేత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ అభ్యర్థిగా రెండు రోజుల క్రితం టీడీపీ నుంచి జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్ పేరు ప్రకటించారు.
రైల్వే కోడూరు అభ్యర్థి మార్పు?
ఇదిలా ఉండగా అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుపైనా సమాలోచనలు చేస్తున్నారు. ఆ స్థానానికి ఇప్పటికే ఎనమల భాస్కరరావు పేరు ప్రకటించారు. అయితే ఈయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదు. దీంతో మిత్రపక్షమైన తెలుగు దేశంవైపు నుంచి కూడా అనుకూలత లేదు. ఈ క్రమంలో అభ్యర్థిని మార్చాలని పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారు. అభ్యర్థి మార్పుపై కొన్ని గంటల్లో నిర్ణయం తీసుకుంటామని జనసేనాని ప్రకటించారు.
గుడ్డిగా ప్రకటించారా..
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ప్రకటన చూస్తే అభ్యర్థుల ప్రకటనలో ఎలాంటి ప్రమాణాలు పాటించలేదని అర్థమవుతోంది. గుడ్డిగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అభ్యర్థిని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వ్యతిరేకిస్తుండడంతోనే మార్చాలని పవన్ భావిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగతోంది. టీడీపీ ఒత్తిడికి జనసేనాని తలొగ్గుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం జనసేనలో చేరిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చాచిర్జ రూపానందరెడ్డి అనుచరుడు శ్రీధర్‌కు టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్ల తెలుస్తోంది.
అందుకే డ్రామా..
టీడీపీ ఇన్‌చార్జికి టికెట్ ఇవ్వడానికే జనసేనాని అభ్యర్థిపై వ్యతిరేకత పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నట్లు జనసేనలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పొత్తు పెట్టుకున్నాక.. ఇంతలా పవన్ కళ్యాణ్ టీడీపీ ఒత్తిడికి తలొగ్గడం, టీడీపీ నేతలు చెప్పిన వారికే టికెట్లు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనసేనాని నిర్ణయాలు కూడా టీడీపీ తీసుకోవడం జనసేన క్యాడర్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. క్షేత్రస్థాయిలో పవన్‌కు పట్టు లేని కారణంగానే టీడీపీ ఆడించినట్లు పవన్ ఆడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.