Kolikapudi Srinivasarao vs Kesineni Chinni : రాజకీయాలలో ఉన్నప్పుడు ఒక మాటకు కట్టుబడి ఉండాలి. ఒక పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు.. పార్టీ విధానాలకు లోబడి పని చేయాలి. అలా కాకుండా గెలిచిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు చేస్తా.. నాకు నచ్చినట్టు ఉంటా.. అని అంటే కుదరదు. ప్రస్తుతం ఏపీలోని టిడిపి లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీ తిరువూరు ఎమ్మెల్యే అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి ఆయన అధినేత ఆగ్రహాన్ని చవిచూశారు. ఇప్పుడు ఏకంగా మరింత కవ్వింపు చర్యలకు దిగారు.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అంతకుముందు శ్రీనివాసరావు కొన్ని ప్రైవేట్ న్యూస్ చానల్స్ డిబేట్ల లో పాల్గొనేవారు. విషయ పరిజ్ఞానం ఉన్న నేపథ్యంలో శ్రీనివాసరావు కు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. వైసిపి పరిపాలనపై విసుగు చెందిన ప్రజలు శ్రీనివాసరావుకు జై కొట్టారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఏదో ఒక వివాదంలో శ్రీనివాసరావు ఉంటూనే ఉన్నారు.. అప్పట్లో టిడిపి నేత రమేష్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు ఆందోళన చేశారు. ఏకంగా ధర్నా చేసి తిరువూరులో సంచలనం సృష్టించారు. దానిని మర్చిపోయిన తర్వాత ఇంకా కొన్ని భూ వివాదాలలో వేలు పెట్టారు. ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిపోయాయి. దీనికి తోడు ఆయన వ్యవహార శైలి కూడా కింది స్థాయి కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారింది. ఇటీవల కాలంలో శ్రీనివాసరావు మీద అధిష్టానానికి విపరీతంగా ఫిర్యాదులు వస్తున్నాయి. అప్పట్లో రమేష్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు ఆందోళన చేసినప్పుడు.. వైసిపి అనుకూల మీడియా విపరీతమైన ప్రచారం కల్పించింది. శ్రీనివాసరావుతో అప్పట్లో చంద్రబాబు మాట్లాడారు. ఆ తర్వాత సమస్య పరిష్కారానికి కృషి చేశారు. అంతటితోనే శ్రీనివాసరావు ఆగలేదు. ఇప్పుడు ఏకంగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని పై శ్రీనివాసరావు విమర్శలు చేశారు. ఇందులో డబ్బుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది.
తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తాను చిన్నికి ఐదు కోట్లు ఇచ్చినట్టు శ్రీనివాసరావు ఆరోపించారు. బ్యాంకు స్టేట్మెంట్ కూడా వాట్సాప్ పెట్టారు.. అనేక పర్యాయాలు తాను డబ్బులు పంపించినట్టు అందులో శ్రీనివాసరావు పేర్కొన్నారు. అయితే దీనిపై చిన్ని కూడా స్పందించారు. దొంగే దొంగని అరుస్తున్నాడని.. ఆ ఆరోపణలపై సాక్ష్యాలు కూడా ఇవ్వాలని చిన్ని డిమాండ్ చేశారు. తాను డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే తిరువూరు దాకా అవసరం లేదని.. ఎలాంటి వ్యాపారాలు చేసిన సరే డబ్బులు వస్తాయని చిన్ని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై శ్రీనివాసరావు, చిన్నిని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుక్రవారం ఎన్టీఆర్ భవన్ కు రావాలని ఆదేశాలు జారీ చేశారు.
టిడిపి అనుకూల మీడియా మాత్రం శ్రీనివాసరావు వ్యవహర శైలిపై మరో విధంగా కథనాలను ప్రసారం చేస్తోంది. శ్రీనివాసరావుకు ఇప్పటికే అనేక అవకాశాలను చంద్రబాబు ఇచ్చారని.. ఇకపై ఇచ్చే ప్రసక్తి లేదని.. పార్టీ నుంచి బయటికి పంపించడమే మిగిలి ఉందని చెబుతున్నాయి. దీంతో శ్రీనివాసరావుకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. అయితే శ్రీనివాసరావును బయటికి పంపించే విషయంపై ఇంతవరకు టిడిపి అధికారికంగా ప్రకటన చేయలేదు. ప్రస్తుతం చంద్రబాబు విదేశాలలో ఉన్నారు. శ్రీనివాసరావు వ్యవహారంపై ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ రావాలంటే ఇంకా కాస్త సమయం పడుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ శ్రీనివాసరావు వల్ల కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది తప్పడం లేదని సమాచారం.
బిగ్ బ్రేకింగ్
ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు డిమాండ్
టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు
2024 ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం రూ.5 కోట్లు చిన్ని అడిగాడంటూ ఆరోపణలు
తన అకౌంట్ నుంచి మూడుసార్లు రూ.60 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసినట్లుగా ఫేస్… pic.twitter.com/MkauXMBXqE
— Telugu Feed (@Telugufeedsite) October 23, 2025