Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. అయితే ఆయన ఎంతో ధైర్యం ఉన్న నాయకుడిగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు తనపై కేసుల విచారణ పై స్టే ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడం మాత్రం గుర్తించాల్సిన విషయం. వైసిపి హయాంలో ఆయన నోటికి అడ్డు అదుపూ లేకుండా పోయేది. దమ్ముంటే రండి.. నాపై పోటీ చేయండి.. గెలవండి అంటూ సవాళ్లు చేసేవారు. సినీ రాజకీయ రంగాల ప్రముఖులను సైతం చాలా తేలిగ్గా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి అయినా ఆయనకు లెక్క ఉండేది కాదు. చివరకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కూడా చాలా చులకనగా మాట్లాడేశారు. అయితే అధికారం ఉంటేనే తనలో ధైర్యం అన్నట్టు ఆయన మాట్లాడేవారు. వ్యవస్థలు అంటే ఓన్లీ వైసీపీ ప్రభుత్వం అన్నట్టు ఉండేవారు. ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో ఆయనకు వ్యవస్థలు గుర్తుకొస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఏకంగా కోర్టును ఆశ్రయించారు. తనపై కేసు విచారణను నిలిపివేయాలని కోరారు. ఎంతటి ధైర్యవంతుడైన నాని ఇలా కోర్టును ఆశ్రయించారు ఏంటి అని సొంత పార్టీ వారే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
* వ్యవస్థలపై విచ్చలవిడి వ్యాఖ్యలు..
జగన్మోహన్ రెడ్డి తన వైసీపీ ప్రభుత్వం మరో 30 సంవత్సరాలు పాటు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. విచ్చలవిడి సంక్షేమంతో ప్రజల చేతులకు బందీలు వేసామని.. వారంతా తమకు కాకపోతే ఎవరికి మద్దతు ఇస్తారని ఆయన భావించినట్టు ఉన్నారు. అధినేత జగన్ మాట తమకు శిరోధార్యంగా భావించే కొడాలి నాని లాంటివారు దానినే బలంగా నమ్మారు. అందుకే ప్రత్యర్ధులతో పాటు రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై విచ్చలవిడిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు చట్టపరమైన ఉచ్చు గట్టిగా బిగిస్తుండడంతో.. అదే చట్టాన్ని ఆశ్రయించడం మాత్రం నిజంగా గమనార్హం. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కొడాలి నాని వ్యాఖ్యలను గుర్తు చేస్తే ఎవరికైనా బాధ కలగక మానదు. కానీ ఇప్పుడు అదే కేసు కొడాలి నాని మెడకు చుట్టుకుంది. ప్రభుత్వం ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడంతో.. వైసిపి హయాంలో వ్యవస్థలపై దాడికి సంబంధించిన అంశంపై కోర్టు కఠినంగా స్పందించే అవకాశం ఉంది. కానీ అదే న్యాయస్థానంలో విచారణ నిలిపివేయాలని కొడాలి నాని కోరడం మాత్రం ఆత్మరక్షణ కోసమే.
* వరుసగా కేసులు..
ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు మాత్రమే కాదు.. కొడాలి నాని పై చాలా కేసులు ఎదురు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో గుడివాడలో సాగిన ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు, పేకాట క్లబ్బుల నిర్వహణ, ఇతర బెదిరింపులు.. ఇలా అన్ని తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో విచారణ ప్రారంభం అయితే.. చట్టం ఏ రేంజ్ లో పంజా విసురుతుందో కొడాలి నాని కి తెలుసు. రిమాండ్ ఖైదీగా కొద్ది రోజులు.. అటు తరువాత కేసుల విచారణ పేరుతో కాళ్ళ అరిగేలా తిరగాల్సి ఉంటుంది. అందుకే ముందస్తుగానే విచారణను కొంతవరకు అడ్డుకోవాలని చూస్తున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు అని నిపుణులు చెబుతున్నారు.
