Kimidi Nagarjuna: టిడిపి సీనియర్ నేత కళా కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెట్టారు. టికెట్ల కేటాయింపులో కోత విధించడంతో ఆ కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. కళా వెంకట్రావుకు చీపురుపల్లి అసెంబ్లీ సీటును కేటాయించారు. దీంతో అక్కడ ఇన్చార్జిగా ఉన్న కిమిడి నాగార్జున రాజీనామా చేశారు. పార్టీ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఐదు సంవత్సరాలు కష్టపడి పని చేస్తే వేరే వ్యక్తులకు టిక్కెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. చీపురుపల్లిలో నాగార్జున అభిమానులు పెద్ద ఎత్తున అలజడి సృష్టించారు. ఇక్కడ పార్టీ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తామని హెచ్చరించారు. దీంతో సొంత కుటుంబంలోనే రగడ ప్రారంభమైంది. నాగార్జున ఎవరో కాదు.. కళా వెంకట్రావు సోదరుడు గణపతి కుమారుడు.
కళా వెంకట్రావు సుదీర్ఘకాలం శ్రీకాకుళం జిల్లా ఉణుకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో ఉణుకూరు నియోజకవర్గం కనుమరుగయ్యింది. రాజాం నియోజకవర్గం తెరపైకి వచ్చింది. ఉణుకూరు జనరల్ నియోజకవర్గం కాగా.. రాజాం ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో కళా వెంకట్రావు ఎచ్చెర్ల నియోజకవర్గానికి మారారు. అప్పటివరకు ఎస్సీ రిజర్వు నియోజకవర్గంగా ఉన్న ఎచ్చెర్ల జనరల్ గా మారింది. వరుసగా మూడు ఎన్నికల్లో పోటీ చేసిన కళా వెంకట్రావు ఒక్కసారిగెలిచారు.రెండుసార్లు ఓడిపోయారు. ఈసారి కూడా ఎచ్చెర్ల సీటును ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఎచ్చెర్ల స్థానాన్ని బిజెపికి కేటాయించారు. దీంతో కళా వెంకట్రావు చీపురుపల్లి వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయింది.
కళా వెంకట్రావు సోదరుడు గణపతి రావు భార్య మృణాళిని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పదవి చేపట్టారు. అప్పట్లో కళా వెంకట్రావు రాజ్యసభ సభ్యుడిగా ఉండగా.. ఆయన సోదరుడు గణపతి ఉణుకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తో ఉణుకూరు నియోజకవర్గం కనుమరుగు కావడం.. ఎచ్చెర్ల తెరపైకి రావడంతో అక్కడికి కళా వెంకట్రావు వెళ్లిపోయారు. అయితే 2014లో ప్రత్యేక పరిస్థితుల్లో చీపురుపల్లికి అభ్యర్థి అవసరమయ్యారు.ఆ సమయంలో మృణాళిని పేరు తెరపైకి వచ్చింది. ఆమె పుట్టినిల్లు చీపురుపల్లి కావడం… ఆమె సోదరుడు కెంబూరి రామ్మోహన్ రావు విజయనగరం ఎంపీగా పని చేసి ఉండడంతో చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఆమెతో పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో మృణాళిని గెలిచారు. అటు పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ఆమెను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే అదే కుటుంబానికి చెందిన కళా వెంకట్రావుకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కానీ విస్తరణలో మృణాళినిని తొలగించి కళా వెంకట్రావుకు చాన్స్ ఇచ్చారు.
2019 ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి కళా వెంకట్రావు పోటీ చేయగా.. చీపురుపల్లి నుంచి మాత్రం మృణాళిని కుమారుడు నాగార్జునకు ఛాన్స్ ఇచ్చారు. కానీ నాగార్జున బొత్స సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. టిడిపి జిల్లా పగ్గాలు కూడా అందుకున్నారు.గత ఐదు సంవత్సరాలుగా చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడుకళా వెంకట్రావును చీపురుపల్లికి పంపించడం ద్వారా.. కుటుంబంలో ఒక్కరికే టిక్కెట్ అని చంద్రబాబు తేల్చి చెప్పారు. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక కుట్ర జరిగిందని నాగార్జున అనుమానిస్తున్నారు. అందుకే పెదనాన్న అభ్యర్థిత్వాన్ని సైతం వ్యతిరేకిస్తున్నారు. అయితే ఎచ్చెర్లలో సీటు లేకుండా చేసి కళా వెంకట్రావును చీపురుపల్లికి పంపించడం మాత్రం.. ఆ కుటుంబంలో అలజడికి కారణమవుతోంది.