Kamma leaders in Uttarandhra: రాజకీయంలో ‘కులం'( caste) అనేది ప్రధాన భూమిక పోషిస్తోంది. మా కులం ఉన్నచోట మీ పెత్తనం ఏంటి అనే మాట తరచూ వినిపిస్తోంది. కులం అనే ముద్ర లేకుండా ఏ ఎన్నికలు జరగడం లేదు. కులాలను ప్రాతిపదికగా తీసుకొని రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నాయి. ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీలు అదే ఫార్ములాను అనుసరిస్తూ వస్తున్నాయి. అయితే చాలామంది నేతలు కులం కార్డు లేకుండానే రాజకీయాల్లో రాణించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కమ్మ నేతలు ప్రజాప్రతినిధులుగా సుదీర్ఘకాలం మనగలిగారు. ఆ నియోజకవర్గంలో సదరు నేత కుటుంబం తప్ప.. ఆ సామాజిక వర్గం లేకపోవడం గమనార్హం.
Also Read: పదవుల్లేవ్.. పవన్ కళ్యాణ్ కు షాకిచ్చిన బాబు
ఇచ్చాపురం తో ఎంవిపి అనుబంధం..
శ్రీకాకుళం జిల్లాలో మండవ వెంకట కృష్ణారావు( Mandava Venkata Krishna Rao )..అలియాస్ ఎంవి కృష్ణారావు సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు. ఇచ్చాపురం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఓ సాధారణ కాంట్రాక్టర్. ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో క్లాస్ వన్ కాంట్రాక్టర్ గా కొనసాగారు. అలా ఇచ్చాపురానికి సుపరిచితులు అయ్యారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడంతో ఆయన పిలుపుమేరకు ఆ పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1985లో రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1989లో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. అయితే ఎన్టీఆర్ కృష్ణుడు బొమ్మను ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారని.. 1994 ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. దీంతో ఆయన ప్రధాన అనుచరుడు దక్కత అచ్యుతరామయ్యరెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకున్నారు. 1999లో మాత్రం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంవీ కృష్ణారావు ఆ కుల పరంగా ఒక్కరే. కానీ ఇచ్చాపురం నియోజకవర్గంలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు.
రెండుసార్లు గద్దె బాబురావు
విజయనగరం జిల్లా( Vijayanagaram district) రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు. ఆయన సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. సుదీర్ఘకాలం చీపురుపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. కానీ ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అంటూ లేదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు గద్దె బాబూరావు. ఈయన సైతం కృష్ణా జిల్లాకు చెందిన నేత. 1994లో అనూహ్యంగా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 1999లో సైతం రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ గా పదవి చేపట్టారు. 2004లో మూడోసారి టిడిపి అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు. అయితే దాదాపు దశాబ్ద కాలానికి పైగా చీపురుపల్లిలో రాజకీయం చేశారు బాబురావు. కానీ నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గం లేకుండానే ఎమ్మెల్యేగా విజయం సాధించడం గమనార్హం.
Also Read: ప్రాణం ఖరీదు ₹30 లక్షలు.. ఆఫర్ చేసిన కోట వినూత
ఎచ్చెర్ల నుంచి తాజాగా..
తాజాగా మొన్నటి ఎన్నికల్లో ఎచ్చెర్ల( echerla ) నుంచి గెలిచారు నడి కుదుటి ఈశ్వరరావు. ఈయన సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. ఎచ్చెర్ల నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఎచ్చెర్ల జనాభాలో ఒక్క శాతం కూడా లేని కమ్మ సామాజిక వర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం గమనార్హం. తొలుత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి టిడిపిలో చేరారు ఈశ్వరరావు అలియాస్ ఎన్ఈఆర్. తరువాత బిజెపి గూటికి చేరి పొత్తులో భాగంగా ఎచ్చెర్ల సీటును దక్కించుకున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో దాదాపు 350 పైగా గ్రామాలకు గాను.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన గ్రామాలు కేవలం నాలుగు మాత్రమే. అయినా సరే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం గమనించదగ్గ విషయం.