Kadapa Latest News: నేటి కాలంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉండడం లేదు. వ్యక్తిగతంగా అహలు పెరిగిపోవడంతో ఎవరికివారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. విడాకులు తీసుకోవడం.. దారుణాలకు పాల్పడటం వంటి ఘటనలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి.. ఇవన్నీ కూడా సంసారాలను నడిరోడ్డు మీద పడేస్తున్నాయి. భార్యాభర్తలు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్నప్పటికీ భార్యాభర్తల్లో మార్పు రావడం లేదు..
ఏపీ రాష్ట్రంలోని కడప జిల్లా ముద్దనూరు ప్రాంతానికి చెందిన మారుతి రాజుకు కలసపాడు మండలం దూలం వారి పల్లె ప్రాంతానికి చెందిన ఆదిలక్ష్మితో 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన తొలి రోజుల్లో వీరిద్దరూ బాగానే ఉండేవారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాదాలు పెరిగిపోయాయి. నిత్యం ఘర్షణలు జరుగుతూ ఉండేవి. పెద్దమనుషులు ఎన్నిసార్లు పంచాయతీలు పెట్టి.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల మారుతి రాజు ఆదిలక్ష్మితో మరోసారి గొడవపడ్డాడు. దీంతో తట్టుకోలేక ఆదిలక్ష్మి తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది.
ఆదిలక్ష్మి పుట్టింటికి వెళ్ళిపోయి నెల రోజులు గడిచిపోయాయి. దీంతో మారుతి రాజు విపరీతంగా మద్యం తాగేవాడు. మద్య మత్తులో ఫోన్ చేసి భార్యను ఇబ్బంది పెట్టేవాడు. తనతో కాపురానికి రావాలని వేధించేవాడు. చివరికి ఆదిలక్ష్మి అతని నెంబర్ ఎత్తడం మానేసింది. దీంతో మారుతి రాజుకు కోపం పెరిగిపోయింది. పెద్దమనుషుల ద్వారా వర్తమానం పంపినప్పటికీ ఆదిలక్ష్మి మనసు కరగలేదు. దీంతో మారుతి రాజు అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు.
ఆదిలక్ష్మి బతికి ఉండగానే ఆమె పేరు మీద మరణ ధ్రువీకరణ పత్రం నమోదు చేయించాడు. అంతేకాదు ఆ దృవీకరణ పత్రాన్ని పోస్టు ద్వారా ఆదిలక్ష్మి పుట్టింటి అడ్రస్ కు పంపించాడు. పోస్టులో తన పేరు మీద మరణ ధ్రువీకరణ పత్రం రావడంతో ఆదిలక్ష్మి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తాను బతికి ఉండగానే మరణ ధ్రువీకరణ పత్రాన్ని భర్త పంపడం తట్టుకోలేకపోయింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. పోలీసులు మారుతి రాజును పిలిపించి విచారణ చేశారు. అయితే మారుతి రాజు తన మాతృమూర్తి మరణ ధ్రువీకరణ పత్రంలో మార్పులు చేసి తన భార్యకు పంపించినట్టు తెలిసింది. వీరిద్దరూ కలిసి ఉండాలని.. పిల్లల బాగోగులు పట్టించుకోవాలని.. ఆ దిశగా కౌన్సిలింగ్ ఇవ్వాలని బంధువులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు ఆ దంపతులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.