Pawan Kalyan: చేరదీసి ప్రోత్సహించిన పవన్ నే టార్గెట్ చేస్తున్న నేతలు

గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోతిన మహేష్ కు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చారు. జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. కానీ అక్కడ మహేష్ మూడో ప్లేస్ కు పరిమితమయ్యారు.

Written By: Dharma, Updated On : April 10, 2024 7:50 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: జనసేన పవర్ పాలిటిక్స్ చేయకపోయినా.. చాలామంది నేతలకు మాత్రం గుర్తింపు తెచ్చి పెట్టింది. అంతకుముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినా.. ఆయన అనుకున్నంత రాణించ లేకపోయినా.. చాలామంది నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వగలిగారు. ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన చాలా మంది నాయకులు.. వివిధ పార్టీల్లో చేరి ఇప్పుడు కీలక పదవులు అనుభవిస్తున్నారు. అదే మాదిరిగా జనసేన ఆవిర్భవించి పదేళ్లు దాటుతున్నా… పవన్ సక్సెస్ అందుకోలేకపోయారు. కానీ పవన్ ప్రోత్సహించిన చాలామంది నాయకులు.. రాష్ట్రస్థాయి నేతలుగా గుర్తింపు పొందారు. అయితే అటువంటి నేతలే ఇప్పుడు పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం పై మాట్లాడుతున్నారు. ఆయనపై అవినీతి ముద్ర వేస్తున్నారు. దీనిని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు.

గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోతిన మహేష్ కు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చారు. జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. కానీ అక్కడ మహేష్ మూడో ప్లేస్ కు పరిమితమయ్యారు. అయినా సరే గత ఐదేళ్లుగా పోతిన మహేష్ కు పవన్ ఎనలేని ప్రాధాన్యమిస్తూ వచ్చారు. విజయవాడ నగర బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రస్థాయి నేతగా గుర్తింపు తెచ్చిపెట్టారు. ఇప్పుడు అదే మహేష్ కు టికెట్ దక్కకపోవడంతో ఆయన బయటకు వెళ్లిపోయారు. వైసీపీలో చేరిపోయారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి అడ్డగోలుగా దోపిడీ చేశారని ఆరోపణలు చేశారు. చివరికి పవన్ భార్య విషయం ప్రస్తావించారు. ఒక ప్లాన్ ప్రకారం పవన్ కళ్యాణ్ పై వైసిపి వ్యూహం పన్నింది. జనసేన నేతల్లో అసంతృప్తులను ఆకర్షించింది. వారితోనే మాట్లాడిస్తోంది.

2019 ఎన్నికల్లో ముమ్మిడివరం అభ్యర్థిగా పితాని బాలకృష్ణ పేరును పవన్ తొలిసారిగా ప్రకటించారు. ఈసారి పొత్తులో భాగంగా ఆయనకు టికెట్ దక్కలేదు. ఇప్పుడు అదే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను ప్యాకేజి స్టార్ అంటూ ఆరోపిస్తూ పార్టీని వీడారు. వైసీపీలో చేరారు. పిఠాపురం జనసేన ఇన్చార్జ్ మాకినీడి శేషు కుమారి వైసీపీలో చేరారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక కాపు పెద్దలుగా వ్యవహరిస్తున్న హరి రామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం తమ స్వరూపాన్ని ఎలా బయటపెట్టుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. హరి రామ జోగయ్య అయితే తన బ్యాక్ టు బ్యాక్ లెటర్స్ తో పవన్ కళ్యాణ్ ను డామేజ్ చేసే ప్రయత్నం చేశారు. చివరకు ఆయన కుమారుడు వైసీపీలో చేరారు.

ముద్రగడ పద్మనాభం గురించి చెప్పనవసరం లేదు. కేవలం పవన్ కోసమే ముద్రగడను జగన్ వైసీపీలోకి తీసుకువచ్చినట్టు ఉన్నారు. వేదిక ఏదైనా పవన్ పై విమర్శలే ధ్యేయంగా ముద్రగడ పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మీడియాలో ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. చివరకు కాపులతో సమావేశమై పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలను పక్కన పెడితే.. గత కొన్నేళ్లుగా పవన్ ప్రోత్సహించిన జనసేన నేతలే కించపరిచేలా మాట్లాడడం.. ఇన్నాళ్లు గౌరవించి.. ఇప్పుడు అగౌరవపరచడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో విధేయత అనేది పోయిందని బాధపడుతున్నారు. అటువంటి నేతలతో జనసేనకు వచ్చే నష్టం లేదని తేల్చి చెబుతున్నారు.