YS Jangan : ఏపీ రాజకీయ ముఖచిత్రం మారుతోంది. విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. అధికార పక్షంపై కత్తులు నూరుతున్నాయి. అయినా సీఎం జగన్ లో ఆత్మ విశ్వాసం. వచ్చే ఎన్నికల్లో తనదే గెలుపు అంతులేని విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. పాలనా వైఫల్యాలు, ప్రజల్లో ఆశించిన స్థాయిలో కనిపించని సంతృప్తి ఉన్నా జగన్ లో మాత్రం గెలుపుపై నమ్మకం సడలడం లేదు. మొన్నటి వరకూ వైనాట్ 175 అని భారీ డైలాగులు విసిరినా..ఇప్పుడు మాత్రం అత్తెసరు మెజార్టీతోనైనా గద్దెనెక్కుతానని శపధం చేసి చెబుతున్నారు.
విపక్షాలన్నీ కలవాలన్న ప్రయత్నమే జగన్ ఎంత బలంగా ఉన్నారో చెబుతోంది. అయితే ఆయన రాజకీయంగా బలంగా ఉన్నారా? అంటే చెప్పలేని స్థితి. పోని రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించారా? అంటే అదీ కూడా లేదు. అయినా సరే రెండోసారి అధికారంలోకి వస్తానన్న ధీమా ఎలా అంటే మాత్రం చటుక్కున వచ్చే సమాధానం సంక్షేమ పథకాలు. తన ప్రభుత్వం నుంచి లాభం పొందిన వారు మాత్రమే తనకు ఆదరించాలని కోరుతుండడం కూడా జనాల్లో ఒకరకమైన ఆలోచన వస్తుందని జగన్ భావిస్తున్నారు. మొత్తం 3.98 కోట్ల మంది సంక్షేమ లబ్ధిదారులే తనను గెలిపిస్తారని నమ్మకంగా చెబుతున్నారు.
2019 అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాలపైనే జగన్ ఫోకస్ పెంచారు. ప్రజలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటేనే చాలని భావించారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తే అభివృద్ధి తానంతటే తానే సాధిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై భిన్న వాదనలు, విమర్శలు ఉన్నా పట్టించుకోలేదు. తన సుస్థిర ఓటు బ్యాంకుపైనే దృష్టిసారించారు. ఏపీ ప్రజల్లో 87 శాతం మంది ప్రభుత్వ లబ్ధిదారులు ఉన్నారని.. వారంతా సానుకూలంగా ఆలోచిస్తే చాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
అయితే మొత్తం లబ్ధిదారుల లెక్క కట్టి మరీ గణాంకాలు చెబుతున్నారు. వారంతా సంతృప్తి చెందితే వైనాట్ 175 అసాధ్యం కాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పెన్షనర్లు రూ 2750 చొప్పున అందుకుంటున్న వారి సంఖ్య 65 లక్షలు. ఆ తరువాతి స్థానంలో అమ్మ ఒడి లబ్ది దారులు 45 లక్షలు. రైతు భరోసా అందుకుంటున్న వారు 24 లక్షల మంది. పేదలకు ఇళ్ల పథకంలో లబ్ది దారులు 31 లక్షల మంది. అదే విధంగా వాహన మిత్ర..లా నేస్తం..జగనన్న చేదోడు వంటి లబ్దిదారులు ఉన్నారు. తాజాగా ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ తనను మరోసారి గట్టెక్కిస్తాయని జగన్ నమ్మకంగా ఉన్నారు. కానీ ఆయన అనుకుంటున్నట్టుగా లబ్ధిదారులు ఆలోచిస్తున్నారో? లేదో? చూడాలి మరీ.