YS Jagan : ఎన్నికల్లో వైసీపీకి కొంపముంచింది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.ప్రజల్లో అయోమయం,ఆందోళన సృష్టించింది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోను ముద్రించారు. ఇది ఆందోళనకు దారితీసింది. గతంలో ఏ ప్రభుత్వం సాహసం చేయని విధంగా..జగన్ అలా చేయడంపై విమర్శలు రేగాయి. రైతుల నుంచి నిలదీతలు, ప్రశ్నలు కొనసాగాయి. చివరకు సొంత పార్టీ శ్రేణుల సైతం విమర్శించేందుకు వెనుకడుగు వేయలేదు. సొంత నియోజకవర్గం పులివెందులలో ఎన్నికల ప్రచారం చేసిన జగన్ భార్య భారతికి కూడా నిలదీత ఎదురైంది.సొంత పార్టీ నేత అది తప్పుడు విధానం అని ఖండించారు. మా భూ పత్రాలపై నీ భర్త ఫోటో ఉండడం తగునేనా? అని ప్రశ్నించేదాకా పరిస్థితి వచ్చింది.విపక్షాలకు ప్రచార అస్త్రంగా మారింది. మీ భూములు జగన్ లాక్కుంటారు.. దోపిడీ కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ విపక్ష నేతలు ఊరువాడా ప్రచారం చేశారు. తటస్థులపై ఈ ప్రచారం విపరీతమైన ప్రభావం చూపింది.అందుకే భారీ ఓటమి ఎదురైందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.అయితే తాము అధికారంలోకి వస్తే ఈ వివాదాస్పద యాక్టును రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. ఇప్పుడు ఏకంగా జగన్ ఫోటోను మాయం చేసి
.. దాని స్థానంలో రాజముద్రను వేశారు. హామీని నెరవేర్చుకున్నారు.దీంతో ప్రజలు సైతం ఊపిరి పీల్చుకున్నారు.
* దాంతోనే ఎక్కువ నష్టం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కంటే.. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఎక్కువగా ఎన్నికల్లో ప్రభావం చూపింది. అంతకుముందు జగన్ చిత్రాలతో కూడిన సర్వే రాళ్లను సైతం పొలాల్లో పాతారు. వాటిపై సైతం విమర్శలు వ్యక్తం అయ్యాయి. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మందికి ఇచ్చిన పట్టా పుస్తకాలను వెనక్కి తీసుకుంది. వాటిని తిరిగి రాజముద్రతో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో రైతులకు భూ యజమానులకు ఊరట దక్కింది.
* ఆ నిర్ణయం సాహసమే
తమిళనాడులో సంక్షేమ పథకాలకు అక్కడి పార్టీలు పెద్దపీట వేస్తూ వచ్చాయి. ఉచిత పథకాలు ప్రారంభమైంది తమిళనాడు నుంచే. ముఖ్యంగా ఉచిత పథకాలతోనే జయలలిత నాయకురాలిగా ఎదిగారు. కానీ ఆమె ఎన్నడూ వివాదాలకు సంబంధించిన అంశాల జోలికి పోలేదు. ప్రజలు దేనినైనా సహిస్తారు కానీ.. భూమిపై హక్కును కోల్పోతామంటే ఊరుకోరు. ఈ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకొని జగన్ మూల్యం చెల్లించుకున్నారు.ఏపీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నారు.
* అవకాశంగా మలుచుకున్న చంద్రబాబు
చంద్రబాబు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎన్నికల్లో ప్రచారం పొంది రాజకీయంగా లబ్ధి పొందారు. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఫోటోలు మాయం చేశారు. రాజముద్రను పెట్టి ప్రజల వద్ద క్రెడిట్ కొట్టారు. ఒక విధంగా జగన్ కు అంతులేని నష్టం చేకూర్చగా.. చంద్రబాబుకు మాత్రం ఆయాచిత లబ్ధి చేకూరింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More