Jagan daughters: ప్రతి రాజకీయ నాయకుడు తన వారసత్వాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రాజకీయం అంటే గౌరవంతో కూడిన ఒక రకమైన వ్యాపారం కూడా. అయితే బడా నాయకుల వారసత్వం విషయంలో పెద్దపెద్ద కుటుంబాల మధ్య గొడవ జరగడం అనేది సర్వసాధారణం. అటువంటి పరిస్థితి వైయస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhara Reddy ) కుటుంబానికి ఎదురైంది. తండ్రి అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని కూడా అలంకరించారు. మరోవైపు కుమార్తె షర్మిల సైతం తెలంగాణలో తండ్రి పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. వర్కౌట్ కాకపోవడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ పగ్గాలు తీసుకున్నారు. సోదరుడు జగన్మోహన్ రెడ్డితో విభేదిస్తూ ముందుకు సాగుతున్నారు షర్మిల.
షర్మిల కుమారుడు ఎంట్రీ తో..
మొన్న ఆ మధ్యన షర్మిల ( Sharmila) తన కుమారుడు రాజారెడ్డిని తన వెంట తీసుకొచ్చారు. దీంతో రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం ప్రారంభం అయింది. దానిపై షర్మిల మాట్లాడుతూ కచ్చితంగా రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారని తేల్చి చెప్పారు. వస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసుడు తన కుమారుడు అని ప్రకటించారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి అని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. షర్మిల కుమారుడికి ఆ అవకాశం లేదని తేల్చి చెప్పారు. దీనిపై చాలా రోజులపాటు వాదనలు కొనసాగాయి. మీడియాలో డిబేట్ లు కూడా జరిగాయి.
వారసత్వం విషయంలో..
రాజశేఖర్ రెడ్డి వారసత్వం విషయంలో షర్మిల నుంచి తనకు సవాళ్లు ఎదురవుతాయని జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) తెలుసు. ఇప్పటికే పొలిటికల్ గా ఆమె చాలా డామేజ్ చేశారు. వారసత్వ రాజకీయాల విషయానికి వచ్చేసరికి షర్మిల కుమారుడు రాజారెడ్డి తెరపైకి వస్తే.. తన రాజకీయ వారసత్వం కనుమరుగవుతుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తన కుమార్తెలను రాజకీయాల్లోకి తెస్తారని ప్రచారం ప్రారంభం అయింది. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇంకా బయటపడలేదు. కానీ రాజకీయంగా తన వారసత్వం ఉండాలని ఆయన కోరుకుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా కుమార్తెలను రాజకీయాల్లోకి తీసుకురావడం ఇది కొత్త కాదు. గతంలో చాలామంది నేతలు ఇలానే వచ్చారు.
వచ్చే ఎన్నికల్లో కడప నుంచి అవినాష్ రెడ్డిని తప్పిస్తారని ప్రచారం ఉంది. ఆయనకు బదులు జగన్మోహన్ రెడ్డి కుమార్తెల్లో ఒకరిని పోటీ చేయిస్తారని సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కుమార్తెల గురించి సమాచారం ఇప్పుడు బయటకు వచ్చినా సందర్భాలు లేవు. ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలు చదువు పూర్తి చేసుకుని లండన్ లోనే ఉంటున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి ఉన్నంతవరకు ఆ కుటుంబంలో మహిళలు రాజకీయాల్లోకి రావడం అరుదు. కేవలం రాజకీయ వేదికలపై కనిపించేవారు. కానీ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఆ ఇంటి మహిళలు బయటకు వచ్చారు. రాజకీయాల్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు వారసత్వ రాజకీయం పుణ్యమా అని జగన్మోహన్ రెడ్డి కుమార్తెల పేరు వినిపిస్తోంది. మరి అందులో ఎంత నిజం ఉందో తెలియాలి.