Jagan – Modi Alliances : మోడీతో జగన్.. పొత్తులు, అమరావతినే టార్గెట్

అప్పు పుట్టనిదే ఎన్నికల చివరి ఏడాది పాలన సజావుగా సాగదు. అదే జరిగితే పథకాలు నిలిచిపోతాయి. ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. అందుకే మరింత అప్పులు చేసేందుకు అనుమతివ్వాలని కేంద్ర పెద్దలను జగన్ కోరనున్నారు. రెండు రోజుల పాటు సాగుతున్న జగన్ పర్యటన పక్కా పొలిటికల్ టూర్ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

Written By: Dharma, Updated On : July 5, 2023 9:08 am
Follow us on

Jagan – Modi Alliances : ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీ వెళుతున్నారు. రెండు రోజుల పాటు హస్తినలో మకాం వేయనున్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో పాటు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ప్రతి నెలా జగన్ ఢిల్లీ టూర్ సర్వసాధారణమే అయినా.. ఈసారి మాత్రం స్పెషల్ గా నిలవనుంది. కేంద్రంలో మారిన రాజకీయ సమీకరణలు, పొత్తుల వ్యూహాలు, బీజేపీలో భారీ ప్రక్షాళనలు వంటి పరిణామాల తరువాత సీఎం ఢిల్లీ వెళ్లి అగ్రనేతలను కలుస్తుండడం మాత్రం ఆసక్తిని పెంచుతోంది. ఏపీ వచ్చి అమిత్, షా లు వైసీపీ సర్కారుపై అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నేతలను కలుస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈసారి జగన్ ఢిల్లీ పొలిటికల్ టూర్ చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి వెళుతుందన్న వార్తల నేపథ్యంలో జగన్ దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తారని సమాచారం. అటు బీజేపీ నాయకత్వం మార్పు సైతం జగన్ ను కలవరపెడుతున్న అంశం. గత కొన్నేళ్లుగా పురంధేశ్వరి వైసీపీ సర్కారుపై గట్టిగానే మాట్లాడుతూ వచ్చారు. అదే సమయంలో చంద్రబాబుపై మునుపటిలా వ్యతిరేక భావన లేదు. ఇటీవల దగ్గుబాటి, నారా కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు మెరుగైనట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ హై కమాండ్ తో జగన్ ఏం చర్చిస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రాజధాని లేని నగరంగా ఏపీని నడి రోడ్డున నిలబెట్టారని జగన్ పై ఒక అపవాదు ఉంది. సంక్షేమ పథకాల పరంగా మంచి మార్కులే పడినా.. రాజధాని, అభివృద్ధి వంటి వాటిలో వెనుకబాటుతనం స్పష్టంగా కనిపిస్తోంది. మూడు రాజధానుల విషయంలో అడుగు ముందుకు వేయలేని స్థితిలో జగన్ ఉన్నారు. ప్రస్తుతం అంశం కోర్టు పరిధిలో ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ విషయంలో ముందడుగు వేయాలని ప్రధానిని జగన్ కోరే అవకాశముంది. అవసరమైతే పార్లమెంట్ ద్వారా మూడు రాజధానులకు సానుకూలమైన మద్దతు తెలపాలని, స్పష్టమైన ప్రకటన చేయాలని విన్నవించే చాన్స్ ఉందని తెలుస్తోంది.

పోలవరం అడ్ హాక్ నిధులు,తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, రుణ పరిమితి పెంపు వంటి వాటిపై కేంద్ర పెద్దలకు ప్రత్యేక వినతులు ఇచ్చే అవకాశముంది. అప్పులకు సంబంధంచి ఆర్బీఐ విధించిన రుణ పరిమితి ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే ఏపీ సర్కారు అధిగమించింది. అప్పు పుట్టనిదే ఎన్నికల చివరి ఏడాది పాలన సజావుగా సాగదు. అదే జరిగితే పథకాలు నిలిచిపోతాయి. ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. అందుకే మరింత అప్పులు చేసేందుకు అనుమతివ్వాలని కేంద్ర పెద్దలను జగన్ కోరనున్నారు. రెండు రోజుల పాటు సాగుతున్న జగన్ పర్యటన పక్కా పొలిటికల్ టూర్ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.