Government Medical Colleges: ప్రభుత్వం మెడికల్ కాలేజీల ( government medical colleges) అంశానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని భావిస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి నిర్వహించాలన్నది ప్రభుత్వ ఆలోచన. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. కానీ ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి దీనిని వ్యతిరేకిస్తున్నారు. దీనిని ప్రైవేటీకరణకు మాత్రమే చూస్తున్నారు. అందుకే ఇటీవల నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో.. నాలుగు కాలేజీలకు గాను ఒక కాలేజీకి మాత్రమే టెండర్ వచ్చింది. మిగతా కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు పనిచేశాయి. కేంద్ర ప్రభుత్వం సైతం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ముందుకెళ్తోంది. ఏపీ విషయంలో కూడా అదే తరహా విధానంతో ముందుకు వెళ్లాలని సూచించింది. దీనిపై కోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే అందులో తప్పు ఉంటేనే తాము కలుగ చేసుకుంటామని కోర్టులు తేల్చి చెప్పాయి. మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధానం తీసుకుంటే ఆ విధానంతో ముందుకు వెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించింది.
ఒక్క కాలేజీకి మాత్రమే..
ఓ నాలుగు కాలేజీల నిర్మాణానికి సంబంధించి టెండర్లకు దరఖాస్తులు ఆహ్వానించింది ప్రభుత్వం. కానీ ఒక్క ఆధోని( Adoni) కాలేజీ నిర్మాణంతోపాటు నిర్వహణకు ముందుకు వచ్చింది కిమ్స్ సంస్థ. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు పనిచేశాయని ప్రచారం ఎక్కువైంది. అందులో రాజకీయ వ్యూహం ఉందా లేదా అన్నది పక్కన పెడితే.. పొలిటికల్ గా కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. అయితే మెడికల్ కాలేజీల అంశంలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దానిని తప్పు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. ఇలా బాధ్యత రాహిత్యంతో పని చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం స్పందించదు ఎందుకు. అది మేము ఆదేశించిన విధానం అంటూ ప్రకటిస్తే కచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు అవుతుంది. కానీ కేంద్రం మాత్రం మౌనంగానే ఉంది.
నిబంధనలు సైతం కఠినం..
అయితే ఒక్క జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) వ్యతిరేకిస్తున్నారని చెప్పలేం కానీ.. టెండర్లకు అనుకూలమైన వాతావరణం లేదని.. చాలా రకాల కఠినతర నిబంధనలు కనిపిస్తున్న దృష్ట్యా ప్రైవేటు సంస్థలు ముందుకు రాలేదని తెలుస్తోంది. అయితే ప్రచారం వేరేలా ఉంది. జగన్మోహన్ రెడ్డి భయం పనిచేస్తుందని ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తోంది. అయితే అది ప్రభుత్వానికి ప్రతికూలంగా మారుతుందా? లేకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమా? అన్నది చెప్పలేం. అయితే ఒక ప్రభుత్వ విధానాలను, పాలసీలను విపక్ష నేత ప్రభావితం చేస్తున్నారు అంటే అది కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. ఏకంగా భయపెడుతున్నారు అంటే మాత్రం అది ఆలోచించదగ్గ విషయమే. కచ్చితంగా దీని ఇంపాక్ట్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పడుతుంది. ఆలోచించుకోవాల్సింది ఆ పార్టీయే. ఇంకోవైపు ప్రభుత్వం సైతం కఠిన నిబంధనలు ఉపసంహరించుకుంటే ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చే పరిస్థితి ఉంది.