Nara Lokesh : లోకేష్ కట్టడి ఎలా? మంగళగిరిలో జగన్ కొత్త ప్రయత్నం!

ఎన్నికల్లో నారా లోకేష్ ఘనవిజయం సాధించారు.ఏ స్థానంలో అయితే ఓడిపోయారో..అదే నియోజకవర్గంలో 90 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు లోకేష్ ను కట్టడి చేసేందుకు జగన్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తుండడం విశేషం

Written By: Dharma, Updated On : October 10, 2024 11:11 am

Nara Lokesh- YS Jagan

Follow us on

Nara Lokesh :  ఏపీలో మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. రాజధాని అమరావతి పరిధిలోని ఈ నియోజకవర్గానికి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ప్రస్తుతం ఆయన ఏపీ మంత్రి కూడా.2019 ఎన్నికల్లో తొలిసారిగా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు.2024 ఎన్నికల్లో సైతం మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు లోకేష్.దీంతో జగన్ స్ట్రాటజీ మార్చారు.మరోసారి లోకేష్ ను మంగళగిరి నుంచి ఓడించాలని గట్టి ప్రయత్నాలు చేశారు.అందులో భాగంగా బలమైన బీసీ మహిళా అభ్యర్థిని రంగంలోకి దించారు.గట్టి పోటీ ఉంటుందని భావించారు.కానీ లోకేష్ ఏకపక్షంగా విజయం సాధించారు. రికార్డు స్థాయిలో 90 వేల మెజారిటీతో వైసిపి అభ్యర్థిని మట్టి కరిపించారు. ఇప్పుడు లోకేష్ ను కట్టడి చేయడం జగన్ కు అతి కష్టం అవుతోంది.గెలిచిన దగ్గరనుంచి లోకేష్ నియోజకవర్గం లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు.చాలా క్రియాశీలకంగా ఉన్నారు.ప్రజా దర్బార్లు నిర్వహించి ప్రజలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. ఇప్పుడు లోకేష్ ను ఎలా నియంత్రించాలో జగన్ కు తెలియడం లేదు.

* అప్పట్లో జగన్ సక్సెస్
2019 ఎన్నికల్లో లోకేష్ ను ఓడించేందుకు జగన్ చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు.అందులో సక్సెస్ అయ్యారు కూడా. దీనికి తోడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యూహంతో ముందుకు సాగారు.దానికి తగ్గట్టుగానే ఆయనకు విజయం వరించింది. అప్పటివరకు మంత్రిగా వ్యవహరించిన లోకేష్ కు ఓటమి తప్పలేదు.అయితే 2024 ఎన్నికల్లో సైతం లోకేష్ ను ఓడించేందుకు జగన్ సర్వశక్తులు వడ్డారు. కానీ అనుకున్నది సాధించలేకపోయారు.

* పనిచేయని బీసీ నినాదం
ఎన్నికల్లో మంగళగిరిలో కొత్త స్లోగన్ తెరపైకి తెచ్చారు జగన్.నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ.ముఖ్యంగా పద్మశాలీలు ఎక్కువగా ఉన్నారు.అందుకే ఆ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి టిక్కెట్ ఇవ్వాలని భావించారు.టిడిపిలో ఉన్న వ్యక్తిని వైసీపీలోకి రప్పించారు.నియోజకవర్గ ఇన్చార్జిని చేశారు.అయితే ఆయనను సైతం తప్పించి బలమైన బీసీ అభ్యర్థి మురుగుడు లావణ్యతో పోటీ చేయించారు.అయినా సరే ఆమెకు ఓటమి తప్పలేదు. అయితే ఇప్పుడు ఎన్నికల అనంతరం లోకేష్ ను నియంత్రించేందుకు వేమారెడ్డిని కొత్తగా ఇంచార్జిగా నియమించారు జగన్. ఎన్నికల ముందు బీసీ నినాదంతో ముందుకు పోగా..ఇప్పుడు మరోసారి సొంత సామాజిక వర్గాన్ని తనపైకి తెచ్చారు. కనీసం వేమారెడ్డి అయినా లోకేష్ దూకుడు నియంత్రించగలరా?లేరా? అన్నదిచూడాలి.