Jagan: రాజకీయ పార్టీలకు జయాపజయాలు అనేవి సహజం. సర్వసాధారణం కూడా. ఓడిన పార్టీ గెలవాలని చూస్తుంది. గెలిచిన పార్టీ ఆ విజయాన్ని నిలుపుకోవాలని చూస్తుంది. సిద్ధాంత విభేదాలు తప్ప.. ప్రతి పార్టీ అంతిమ సిద్ధాంతం ప్రజలకు ఉపయోగపడడమే. వెళ్లే దారి వేరైనా.. అన్ని రాజకీయ పార్టీల గమ్యం మాత్రం ఒక్కటే. అయితే ఆ పార్టీల లోపాలు, వైఫల్యాలు, ఉత్తమ ఫలితాలు అనేవి మాత్రమే చర్చకు వస్తాయి. వాటినే పరిగణలోకి తీసుకుంటారు. 2014లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. 2019లో చంద్రబాబు ఓడిపోయారు. 2024లో మరోసారి జగన్కు ఓటమి ఎదురైంది. అయితే ఇలా ఓటములు ఎదురైన పార్టీలు అందుకు కారణాలను అన్వేషిస్తుంటాయి. పోస్టుమార్టం చేస్తుంటాయి.
* దయనీస్థితిలో లేదు..
2025 ఏడాదిలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ పరిస్థితిపై రివ్యూ చేస్తే.. దయనీయ స్థితిలో లేదనే చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కాకపోవడం.. అదే దురహంకారంతో మాట్లాడుతుండడం మాత్రం ఆ పార్టీకి బ్యాక్ డ్రాప్. కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చి ప్రజల మనసును గెలవాలని చూస్తోంది. జగన్మోహన్ రెడ్డి సైతం తమ పార్టీ శ్రేణులకు అదే పిలుపునిచ్చి ప్రజలతో మమేకం కావాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆయన అలా చేయడం లేదు. ఎంతవరకు ప్రభుత్వం పై వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత వంటి మాటల దాడితో గడిపేస్తున్నారు. దీనివల్ల ఆ పార్టీకి నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రజలు ఇష్టపడే, మెచ్చుకునే విధంగా పోరాటాలు చేయాలి. అలా చేయకపోతే ఆ పార్టీకి ఎప్పటికీ కష్టమే.
* తిరిగి నిలబెట్టడంలో..
వైసీపీని తిరిగి నిలబెట్టడంలో మాత్రం జగన్ కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఎలాగోలా పార్టీని నిలబెట్టాలి అనేది ఆయన ఆలోచన. ఎలాగూ టిడిపి కూటమికి ప్రత్యామ్నాయం లేదు. జగన్ తో పాటు వైసీపీ నేతల ఆలోచన కూడా అదే. మంచి గానైనా చెడుగానైనా ఏదో విధంగా పార్టీ గురించి చర్చ జరగాలన్నది వారి ఆలోచన. ఎలాగైనా పార్టీ నిలబెడుతుంది కదా అనేది వారి ధీమా. జగన్ చేస్తున్న ప్యాలెస్ రాజకీయాలతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలుస్తుందా? లేదా? అని చెప్పడం చాలా కష్టం. అయితే ఏపీలో తిరుగులేని పార్టీగా నిలపడంలో జగన్ సఫలం అయ్యారని చెప్పవచ్చు. కానీ ఆయన వెళ్తున్న విధానం విరుద్ధం. అయితే ప్రజల్లో పార్టీని నిలబెట్టాలి అంటే ఏదో ఒక మార్గం అవసరం. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ఏదో ఒక ఫైట్ చేయాలని… పార్టీని యధాతధంగా నిలిపి.. తన మార్కు రాజకీయాన్ని నచ్చే పార్టీ శ్రేణులను నిలబెట్టుకుంటూ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి.
* ఆయన ఆలోచన అదే..
జగన్( Jagan Mohan Reddy) ఆలోచన ఎలా ఉంది అంటే.. పార్టీని నిలబెట్టుకుంటే చాలు అధికారం తనంతట అదే వస్తుందని ఆయన భావిస్తున్నారు. రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారమే అయినప్పుడు దానిని సాధించే దిశగా ముందుకు సాగాలి అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. జగన్ నమ్మకానికి ఓ బలమైన కారణం కనిపిస్తోంది. సాధారణంగా ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడూ ఒకప్పుడు తప్పకుండా అధికారంలోకి వస్తుందన్న నమ్మకమే. అందుకే పార్టీని అలా నడుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఇష్టపడుతున్నారా? అది ప్రజాస్వామ్య యుతమా? అన్నది కాదు. ఎలాగోలా పార్టీని నడిపి అలానే ఉంచితే ఏపీ ప్రజలే తనకు అధికారం ఇస్తారన్న ధీమా జగన్మోహన్ రెడ్డి ది. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా.