Jagan: ఏపీలో( Andhra Pradesh) బలం పెంచుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఇది మంచిదే అయినా.. ఇప్పటివరకు తనకు అండగా నిలిచిన బలమైన కుటుంబాలను వదులుకోవడం మాత్రం నిజంగా ఆయనకు లోటు. ఎందుకంటే ఆయన పార్టీ ప్రకటించినప్పుడు మంత్రి పదవులు వదులుకున్న వారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న దశాబ్దాల బంధాన్ని వదులుకున్న వారు ఉన్నారు. అయితే ఇప్పుడు వారంతా జగన్మోహన్ రెడ్డి వైఖరితో విసిగి వేసారి పోయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే చాలామంది వెళ్లిపోయారు కూడా. అయితే ఎవరు వెళ్లిపోయిన డోంట్ కేర్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. తాజాగా నెల్లూరుకు చెందిన మేకపాటి కుటుంబం సైతం బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే వారిని అడ్డుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
* సుదీర్ఘ రాజకీయ నేపథ్యం..
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో( Nellore district) మేకపాటి కుటుంబం సుదీర్ఘకాలం రాజకీయం చేసింది. ముక్కు సూటితనంతో పాటు ప్రజల్లో మంచి పేరు ఉంది ఆ కుటుంబానికి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట కుటుంబం ఉంది. రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో అడుగులు వేసింది. అందుకు తగ్గట్టుగానే ఆ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మేకపాటి రాజమోహన్ రెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వగా.. ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. అయితే గౌతమ్ రెడ్డి మరణం తర్వాత మేకపాటి కుటుంబం విషయంలో జగన్ సరైన న్యాయం చేయలేదన్న టాక్ ఉంది. ఆ కుటుంబానికి రాజకీయంగా ప్రోత్సహించలేదన్న విమర్శ సైతం మూటగట్టుకున్నారు జగన్.
* నెల్లూరులో వైసీపీకి బలం..
నెల్లూరు జిల్లాలో పేరు మోసిన రాజకీయ కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే ఆ కుటుంబాలన్నీ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పట్ల ఆదరణ కనబరచడంతో 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఏకపక్ష విజయం సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లు జగన్మోహన్ రెడ్డి పై ఈగ వాల నిచ్చేవారు కాదు. ఆపై మేకపాటి కుటుంబం దూకుడుగా లేకపోయినా తెర వెనుక జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచేది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో వీరందర్నీ కాదని అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతను ప్రోత్సహించారు జగన్మోహన్ రెడ్డి. దీంతో జగన్ వైఖరి నచ్చక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నేతలు బయటకు వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ వైసిపి బలాన్ని తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం మేకపాటి కుటుంబం మాత్రమే నెల్లూరు జిల్లాలో పెద్దదిక్కుగా కనిపిస్తోంది. ఆ కుటుంబం సైతం ఇప్పుడు టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
* జగన్ చుట్టూ కోటరీ పై విమర్శలు..
మొన్న ఆ మధ్యన మేకపాటి రాజమోహన్ రెడ్డి( rajamohan Reddy ) కీలక ప్రకటన ఒకటి చేశారు. కోటరీ ఉందని.. వారంతా జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నారని.. ఆయనకు వాస్తవాలు తెలియనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటినుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి చుట్టూ ప్రచారం ప్రారంభం అయింది. త్వరలో ఆయన పార్టీ మారుతున్నారని కూడా టాక్ నడిచింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో.. పార్టీకి గుడ్ బై చెప్పేందుకు మేకపాటి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.