Jagan: ఒక్క సంక్షేమ పథకాలలో తప్ప ఇతర విషయాలను జగన్ సర్కార్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. మరెన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ వాటిని ఉన్నపలంగా విడిచిపెట్టారు. తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కుల గణన విషయంలో చేతులెత్తేశారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు కులగణను చేపట్టాయి. అందులో ఏపీ కూడా ఉంది. అయితే ఎందుకో ఈ కులగణనను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు సర్వేలో సేకరించిన వివరాలు ఎక్కడికి వెళ్లాయి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మిగులుతోంది.
కుల గణన పేరుతో చేపట్టిన సర్వేలో పెద్ద అవినీతి ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలల కిందట రామ్ ఇన్ఫోకు చెందిన ఎఫ్ఏఓ సంస్థకు సర్వే డేటా ప్రాసెస్ బాధ్యతలను అప్పగించారు. గత నెల 20 వరకు కులగణన సర్వే ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. దీని నిర్వహణ బాధ్యతను ప్రణాళిక శాఖ చూసింది. కానీ సర్వే చేసింది మాత్రం సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లే. అప్పట్లో సమగ్ర సర్వేను చేపడుతున్నామని.
.. ఈ కుల గణన దేశానికి ఆదర్శమని.. దీనిని ఒక పుస్తక రూపంలో తెస్తామని చెప్పుకొచ్చారు. ఇలా సేకరించిన వివరాలన్నీ డేటా ప్రాసెస్ చేసే ఎఫ్ఎఓ సంస్థకు చేరిపోయాయి. అయితే సదరు సంస్థతో కాంట్రాక్టు నిలిపివేశామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే చేరాల్సిన సమాచారం చేరిపోయింది. అధికారికంగా కులగణనను పక్కన పెట్టామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఇదో గందరగోళ కార్యక్రమం గా మిగిలిపోయింది. కానీ ఇప్పటికే ప్రజలకు సంబంధించి డేటా చోరీకి గురైందన్న అనుమానం కలుగుతోంది.
అయితే ఈ సర్వేలో కేవలం కులాల వివరాలే సేకరించలేదు. ఆర్థిక పరిస్థితి, ఆస్తులు, ఇళ్లలో ఉండే పశువులు, గొర్రెలు, వంట కోసం వినియోగిస్తున్న గ్యాస్, విద్యుత్ స్టవ్, వంట చెరుకు, గోబర్ గ్యాస్, బయో ఇంధనం వంటి వాటి వివరాలను సమగ్రంగా తెలుసుకుని సర్వే పూర్తి చేశారు. ఆదాయ వనరులు, వారికున్న వ్యవసాయ భూమి, ఇల్లు వంటి వాటిపైన వివరాలతో పాటు అంతకుమించి ఆస్తిపాస్తులు ఉన్నా.. సమగ్రంగా వివరాలను సేకరించారు. అయితే ఇది కుల గణన కోసం చేసినది కాదని.. రాజకీయ లబ్ధి కోసమేనని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వివరాల సేకరణ తరువాత కుల గణనను నిలిపివేయడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇలా చోరీ చేసిన డేటా ఎక్కడికి వెళ్లిందన్న అనుమానం సర్వత్ర నెలకొంది. దీనిని నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉంది.