Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు జరిగి వారం రోజులు అవుతుంది. కల్తీ మద్యం కేసులో ఆయన అరెస్టు జరిగింది. కల్తీ మద్యం తయారు చేయించడమే కాకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా జోగి రమేష్ వ్యవహరించారన్నది ప్రధాన ఆరోపణ. అందుకే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. జోగి రమేష్ ను అరెస్టు చేసింది. ఈ నెల నాలుగున ఆయన అరెస్టు అయ్యారు. అయితే ఈ అరెస్టును ఖండించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. వైసిపి హయాంలో చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలిపినందుకు ఆయన అరెస్టు జరిగిందని ఆరోపిస్తోంది. అయితే జోగి రమేష్ అరెస్టు జరిగిన తర్వాత వైసీపీ నుంచి అందుతున్న న్యాయ సహాయం పై చర్చ సాగుతోంది. ఇప్పటివరకు ఒక్క నేత కూడా ఆయనను జైలు వద్ద పలకరించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.
* అతిగా ప్రవర్తించారన్న ఆరోపణలు..
వాస్తవానికి జోగి రమేష్( Jogi Ramesh ) కల్తీ మద్యం వ్యవహారంలో అతిగా వ్యవహరించారన్న ఆరోపణ ఉంది. దీనిపై అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం నడిచింది. వైసీపీ హయాంలో జోగి రమేష్ ప్రోత్సాహంతోనే అద్దేపల్లి జనార్దన్ రావు నకిలీ మద్యం తయారు చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో భారీగా నకిలీ మద్యం డంప్ స్వాధీనం అయింది. దీనికి ప్రధాన నిందితుడిగా అద్దేపల్లి జనార్దన్ రావు ఉన్నారు. అయితే ఈ ఘటనపై సైలెంట్ గా ఉంటే పరవాలేదు. కానీ జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంపును సాక్షి మీడియాకు చూపించి అతి చేశారు. అయితే అప్పటికే విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఇండియాకు తిరిగి వచ్చారు. ఒక సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ నకిలీ మద్యం తనతో తయారు చేయించింది మాజీ మంత్రి జోగి రమేష్ అని సంచలన విషయాలను బయటపెట్టారు. ఇదివరకు అద్దేపల్లి జనార్దన్ రావు తో జోగి రమేష్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సైతం బయటకు వచ్చాయి. అయితే తనను కేసులో ఇరికించడంతో పాటు పట్టించుకోకపోవడం వల్లే తాను జోగి రమేష్ పేరు బయట పెట్టానని అద్దేపల్లి జనార్దన్ రావు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని ఇరికించాలన్న ప్రయత్నంలో జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడే కాదు వైసిపి హయాంలో సైతం కల్తీ మద్యం తయారు చేయించారన్న ఆరోపణలు బయటపడ్డాయి. సహజంగానే ఇవి వైసీపీని ఇరకాటంలో పెట్టాయి.
* కూటమి పార్టీలకు దగ్గర ప్రయత్నం
మొన్న ఆ మధ్యన జోగి రమేష్ వ్యవహార శైలి బాగాలేదు. ఆయన కూటమి పార్టీలకు దగ్గరయ్యారు కూడా. అయితే వైసిపి హయాంలో ఆయన వ్యవహరించిన తీరుతో కూటమి పార్టీలు దూరంపెట్టాయి. దీంతో తిరిగి ఆయన వైసీపీలో కొనసాగాల్సి వచ్చింది. అయితే నకిలీ మద్యం వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందంటే.. జోగి రమేష్ ద్వారా వైసీపీకి ఆ మరక అంటింది. ఆపై ప్రమాణాలు అంటూ జోగి రమేష్ అతి చేశారు. ఒకవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ ప్రకారం నకిలీ మద్యం పై పోరాడుతోంది. మధ్యలో ఈ వ్యవహారాన్ని జోగి రమేష్ చెడగొట్టారు అన్నది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. అందుకే జోగి రమేష్ అరెస్టై వారం రోజులు గడుస్తున్న జగన్మోహన్ రెడ్డి అటువైపుగా చూడడం లేదు.
* అందర్నీ పరామర్శించి..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైసిపి నేతల అరెస్టులు జరిగాయి. అలా అరెస్ట్ అయిన వారిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం పరిపాటిగా వచ్చింది. కానీ ఇప్పుడు జోగి రమేష్ ను పట్టించుకోకపోవడం వెనుక ఏం జరిగి ఉంటుందన్నది అనుమానంగా మారింది. కచ్చితంగా జోగి రమేష్ వైఖరి నచ్చక జగన్మోహన్ రెడ్డి పరామర్శించేందుకు ముఖం చాటేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.