YSRCP former Ministers: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పార్టీ పూర్తి ఫోకస్ పెట్టారు. అయితే ఆయన ఇప్పుడు కొందరు మాజీ మంత్రుల విషయంలో కఠినంగా ఉన్నారు. పాత స్థానాలు ఇచ్చే అవకాశం లేదని.. తాను సూచించిన చోటకు వెళ్లాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. అయితే ఇదివరకు పరిస్థితి ఉంటే అధినేత చెప్పిన మరుక్షణం వెళ్లేవారు. కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆపై క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాము వెళ్లలేమని మాజీ మంత్రులు మొండికేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఇలానే చెప్పి పంపించారని.. ఇప్పుడు కూడా మాపై ప్రయోగాలు ఏంటి అని మాజీ మంత్రులు అధినేతను ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే పార్టీలో కొనసాగలేమని చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితి ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు కూటమి పార్టీల్లో చేరలేరు. ఎందుకంటే వీరంతా అధినేత జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులు. ప్రత్యర్ధులపై చెలరేగిపోయేవారు. అందుకే వీరిని తీసుకునేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదు. వైసీపీలో ఉండలేక వీరంతా రాజకీయ సన్యాసం చేసుకునేందుకు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది.
సొంత నియోజకవర్గంలో నో ఛాన్స్..
నెల్లూరు అంటే గతంలో గుర్తుకొచ్చే పేరు అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav). అటువంటి అనిల్ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అనామకుడు. కనీసం పరిగణలో కూడా లేరు. రెండుసార్లు నెల్లూరు సిటీ నుంచి గెలిచిన ఆయన మొన్నటి ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఆయన ఇప్పుడు తిరిగి నెల్లూరు సిటీని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం రకరకాల పేర్లు చెప్పి అక్కడకు వెళ్లాలని సూచిస్తున్నారు. అటు ప్రకాశం, ఇటు గుంటూరులో సీట్లు ఇస్తామని చెబుతుండడంతో చాలా ఆవేదనతో ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు సిటీ ఇస్తే రాజకీయాలు చేస్తా.. లేకుంటే మానుకుంటా అన్నట్టు ఉన్నారు పక్క రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకుని అప్పుడప్పుడు వచ్చి రాజకీయ విమర్శలు చేసి వెళ్లిపోతున్నారు.
అయ్యో విడదల రజిని
మరో మాజీ మంత్రి విడదల రజిని( Rajini ) పరిస్థితి కూడా అలానే ఉంది. 2019 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చిలకలూరిపేట టికెట్ కొట్టేశారు. ఎమ్మెల్యే అయిపోయారు కూడా. తరువాత మంత్రి అయ్యారు. ఒక సిట్టింగ్ మంత్రిగా ఉంటూ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని చెప్పి జగన్ ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. అయితే అక్కడ ఆమె దారుణంగా ఓడిపోయారు. తిరిగి చిలకలూరిపేట వచ్చి రాజకీయాలు చేసుకుంటున్నారు. కానీ ఆమెను ఇప్పుడు రేపల్లె వెళ్ళమంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఉంటే చిలకలూరిపేటలో రాజకీయం చేస్తాను తప్ప తాను రేపల్లె వెళ్లను అని తేల్చేస్తున్నారు రజని. ఆమె కూడా కూటమి పార్టీలో చేరలేక రాజకీయ సన్యాసమే శరణ్యం అని భావిస్తున్నారు. అయితే ఒక్క ఇద్దరు మాజీ మంత్రులే కాదు. అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్ లాంటి వారు సైతం ఇష్టం లేని నియోజకవర్గాల్లోనే కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ఒకటి గమనించుకోవాలి. ఈ నేతలంతా జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులే. విధేయత చూపిన వారికి నచ్చిన పని చేయాలే కానీ.. ఇలా తమపై ప్రయోగం చేయడం ఏంటనేది వీరి వాదన.