AP BJP: ఏపీలో పొత్తుల దిశగా అడుగులు పడుతున్నాయి. టిడిపి, జనసేన కూటమిలోకి బిజెపి చేరే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పొత్తులపై చర్చించేందుకు చంద్రబాబుతో పాటు పవన్ ఢిల్లీ వెళ్లారు. జేపీ నడ్డాతో పాటు అమిత్ షా తో బేటి అయ్యారు. పొత్తుతో పాటు సీట్ల సర్దుబాటుపై చర్చించారు. వారి మధ్య ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. సూత్రప్రాయంగా దాదాపు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈరోజో రేపో పొత్తులపై స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
బిజెపి భారీగా సీట్లు కోరినట్లు తెలుస్తోంది.ఏడు పార్లమెంట్,పది అసెంబ్లీ స్థానాలను బిజెపి ప్రాథమికంగా కోరింది. అయితే ఇప్పటివరకు తాము చేసిన కసరత్తును బట్టి నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది.ఈ అంశంపై ఈరోజు క్లారిటీ రానుంది.టిడిపి ఎన్డీఏలో ఎంట్రీ తో పాటు బిజెపి కేటాయించిన సీట్లు,ఏయే నియోజకవర్గాలు అన్నదానిపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే వైసీపీకి ఇది షాక్ విషయమే.ఏపీలో ఆ మూడు పార్టీల మధ్య పొత్తులు కుదరకూడదని వైసీపీ భావించింది. కానీ అధికార పార్టీ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు.
వాస్తవానికి టిడిపి జనసేన ఓటమిలోకి బిజెపి చేరకుండా జగన్ చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. రకరకాలుగా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించారు. గత నెలలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసినప్పుడు.. వెనువెంటనే జగన్ కూడా ఢిల్లీ బాట పట్టారు. ప్రధాని మోదీ కోసం గంట పాటు వెయిట్ చేసారు. ఒక పది నిమిషాల పాటు సమావేశమయ్యారు. టిడిపిని ఎన్డీఏలో చేర్చుకోవద్దని కోరారు. అవసరమైతే తాను ఎన్డీఏలో చేరతానని ఆఫర్ ఇచ్చారు. అయితే బిజెపి నుంచి సానుకూలత రాలేదని కాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.
అసలు పొత్తు ఉండకూడదు అన్నది వైసిపి ఆలోచన. ఆ విషయం వైసిపి అనుకూల మీడియాను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ప్రతిరోజు టిడిపికి షాక్. బిజెపి ఒంటరి పోరు అంటూ పతాక స్థాయిలో ప్రచారం చేసింది. అయితే తాజాగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతలను కలవడంతో వారి ఆశలు నీరుగారిపోయాయి. అయితే ఒక్కటి మాత్రం నిజం. బిజెపికి ఏపీలో ఉన్న బలం అంతంత మాత్రం. టిడిపి తాపత్రయపడేది కూడా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలనే. వైసిపి భయం కూడా అదే. ఒకవేళ వ్యవస్థల పరంగా కూటమికి బిజెపి సహకరిస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందో వైసిపి ఊహించగలదు. అందుకే టిడిపితో బిజెపి పొత్తు ఉండకూడదని బలంగా కోరుకుంది.అయితే అంతే బలంగా ఆ పార్టీల మధ్య పొత్తు కుదరడం విశేషం.