AP New Ration Cards: ఏపీ ప్రభుత్వం( AP government) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రకటన చేసింది. నవ దంపతులు, కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించనుంది. కొత్త రేషన్ కార్డులను సరికొత్తగా డిజైన్ కూడా చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను అతి త్వరలో ప్రారంభించనుంది. జనవరి చివరి వారంలో కానీ.. ఫిబ్రవరి తొలి వారంలో కానీ ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ప్రకటించారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్( Manohar). ముఖ్యంగా రేషన్ కార్డుల్లో భారీగా బోగస్ ఉన్నట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
వాస్తవానికి గత ఏడాదికాలంగా రేషన్ కార్డుల జారీ( ration cards issue ) ప్రక్రియ నిలిచిపోయింది. చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని భావించారు. కానీ ఏడు నెలలు గడుస్తున్నా అటువంటి కార్యాచరణ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు కొత్త జంటలకు రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. అంతేకాదు రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకు సైతం అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈసారి రేషన్ కార్డుల డిజైన్ కూడా మారనుంది. క్రెడిట్ కార్డుల రూపంలో క్యూఆర్ కోడ్ తో కొత్త కార్డులను జారీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే వేలాదిమంది ఎదురుచూపులకు బ్రేక్ పడినట్టే.
* కొత్తగా రెండు లక్షల కార్డులు
రాష్ట్రవ్యాప్తంగా 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కొత్తగా 70 వేల దరఖాస్తులు ఉన్నాయి. పేర్ల మార్పులు చేర్పులు దరఖాస్తులతో కలిపి రెండు లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం( AP government) అంచనా వేస్తోంది. అయితే ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. కార్డులపై కార్యాచరణ చేయకుంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తోంది. చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులు ప్రాతిపదిక కావడంతో.. ఎక్కువమంది ఎదురు చూడక తప్పడం లేదు. అందుకే రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
* కార్డు డిజైన్ మార్పు
మరోవైపు రేషన్ కార్డుల డిజైన్( ration cards design ) మార్చాలని కూడా కూటమి ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రేషన్ కార్డుల పై వైసీపీ జెండా రంగులు, జగన్ ఫోటో ఉండడం పై విమర్శలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం కొత్త కార్డులపై పార్టీలకు సంబంధించి ఎలాంటి రంగులు, ఫోటోలు ఉండవని చెబుతోంది. కేవలం ప్రభుత్వ లోగో కి పరిమితం చేయనుంది. ఆ మేరకు కొత్త రేషన్ కార్డులను సరికొత్తగా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. ఇది చూడడానికి క్రెడిట్ కార్డు లా ఉంటాయి. క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసేలా కార్డులను రూపొందించారు.
* ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
కొత్త డిజైన్ రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఆమోదం రాగానే కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలుకానుంది. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని భావించారు. సంక్రాంతికి ఇవ్వాలని నిర్ణయించారు. ఒకవైపు రెవెన్యూ సదస్సులు జరుగుతుండడం.. ఇంకోవైపు ధాన్యం కొనుగోలు ఉండడంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను వాయిదా వేశారు. ఈ నెల చివర్లో కానీ.. ఫిబ్రవరి మొదటి వారంలో కానీ రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే కొత్త రేషన్ కార్డులతో పాటే కొత్తగా డిజైన్ చేసిన కార్డులు అందిస్తారా? లేకుంటే ముందే ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.