Kiran Royal : ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు పార్టీలకు రాజీనామాలు, చేరికలు జరుగుతుండగా.. ఇంకోవైపు నేతల లైంగిక వేధింపులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అవి ప్రచార అస్త్రంగా మారుతున్నాయి. అయితే ముఖ్యంగా తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. ఆయనపై రోజుకో వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తోంది. తెర వెనుక ఆయన చాలామంది మహిళలతో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన కోసం ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది. అయితే ప్రజారాజ్యం పార్టీ కాలం నుంచే కిరణ్ రాయల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పుడు జనసేనలో సైతం ఆయనే ప్రముఖ నేతగా ఉన్నారు. అయితే ఇంతకీ ఈ కిరణ్ రాయల్ ఎవరు? ఇంతటి వివాదానికి కారణమేంటి? అసలు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనేది హాట్ టాపిక్ అవుతోంది.
* ఒకానొక దశలో ఎమ్మెల్యేగా పోటీకి..
కిరణ్ రాయల్( Kiran Royal ) తిరుపతి జనసేన ఇన్చార్జిగా ఉన్నారు. పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంటారు. పొత్తులో భాగంగా తిరుపతి టికెట్ జనసేనకు ఇస్తారని.. కిరణ్ రాయల్ పోటీ చేయడం ఖాయమని ప్రచారం నడిచింది. కానీ చివరి నిమిషంలో సమీకరణలు మారడంతో కిరణ్ రాయల్ కు ఛాన్స్ లేకుండా పోయింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కిరణ్ రాయల్ కు ప్రాధాన్యత పెరిగింది. జనసేన వ్యవహారాలపై తరచు ఆయన మాట్లాడుతుంటారు కూడా. ఇటువంటి తరుణంలో ఓ మహిళ ఏకంగా తనకు జరిగిన అన్యాయం పై సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. కోటి 20 లక్షల రూపాయలు తీసుకోవడంతో పాటు 25 సవర్ల బంగారం కిరణ్ రాయల్ తీసుకున్నాడని.. అడిగితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు అంటూ బాధిత మహిళ ఆ వీడియోలో తన ఆవేదనను వ్యక్తపరిచింది. అది మొదలు కిరణ్ రాయల్ చీకటి బాగోతం అంటూ వీడియోలు సోషల్ మీడియాలో వెలుగు చూశాయి. దీంతో జనసేన నాయకత్వం స్పందించింది. విచారణకు ఆదేశించింది. అప్పటివరకు జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది.
* స్థానిక వ్యక్తి కాదు
అయితే కిరణ్ రాయల్ బ్యాక్ గ్రౌండ్ పై( background) ఇప్పుడు బలమైన చర్చ నడుస్తోంది. కిరణ్ రాయల్ తిరుపతికి చెందిన వ్యక్తి కాదని.. అసలు ఏపీ రాష్ట్రానికి చెందిన వాడే కాదని.. ఆయన రాజస్థాన్ కు చెందిన వ్యక్తి అంటూ తెలుస్తోంది. ఆయన తండ్రి మార్వాడి కుటుంబానికి చెందిన వ్యక్తి అని.. ఉపాధి కోసం తిరుపతి వచ్చారని.. పాన్, బేడా విక్రయించేవారని స్థానికంగా ఒక ప్రచారం ఉంది. అసలు కిరణ్ ఇంటి పేరు రాయల్ కాదని.. స్థానికంగా ఓ బలిజ కుటుంబానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవడంతో.. కిరణ్ రాయల్ గా పేరు మార్చుకొని చలామణి అవుతున్నట్లు ప్రచారం ఉంది.
* అలా క్రమేపీ ఎదుగుతూ
కిరణ్ రాయల్ స్వతహాగా చిరంజీవి( megastar Chiranjeevi) అభిమాని. 25 ఏళ్ల కిందట కిరణ్ తిరుపతిలో గ్రూప్ థియేటర్స్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. చిరంజీవి సినిమాలకు బ్లాక్ లో టిక్కెట్లు విక్రయిస్తూ.. ఆపై మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతగా ఎదిగినట్లు సమాచారం. ఆ క్రమంలో ఆర్థికంగా నిలదుక్కుకునేందుకు రైల్వే స్టేషన్ ఎదురుగా ఓ హోటల్ యజమానిని ఒప్పించి కిళ్ళి కొట్టు ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు కొంతమంది చెబుతున్నారు. మెగా ఫాన్స్ గా చిన్నపాటి కార్యక్రమాలు నిర్వహిస్తూ చిరంజీవి దృష్టిలో పడ్డాడని.. క్రమేపి మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ లో ఎదిగాడని ప్రచారం నడిచింది. బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్న తరువాతనే కిరణ్ రాయల్ గా పేరు మార్చుకున్నాడని.. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో హడావిడి చేసి అందరి దృష్టిలో ఫోకస్ అయ్యాడని తెలుస్తోంది. జనసేనలో సైతం యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ తిరుపతి ఇన్చార్జిగా మారినట్లు ప్రచారం ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా కిరణ్ రాయల్ పైనే చర్చ నడుస్తోంది.