TDP Janasena Alliance: తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది. చంద్రబాబు, పవన్ లు ప్రత్యేకంగా సమావేశం అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈనెల 4లోగా అభ్యర్థులను ఖరారు చేస్తారని టాక్ నడుస్తోంది. వీలైనంత త్వరగా ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. అయితే మధ్యలో బిజెపి విషయం ఏమిటన్నది క్లారిటీ లేదు. కానీ ఆ పార్టీ సైతం కూటమిలోకి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మూడు పార్టీలు కలిస్తే ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు? ఎక్కడెక్కడ ఏ పార్టీ పోటీ చేస్తుంది? అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది.ముఖ్యంగా 50-50 ఫార్ములా తెరపైకి రావడం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి.బిజెపి కోరుతున్నట్లు 50-50 ఫార్ములా తెరపైకి వస్తే 80 అసెంబ్లీ స్థానాలు, 12 పార్లమెంట్ స్థానాలను టిడిపి వదులుకోవాల్సి ఉంటుంది. సగం నియోజకవర్గాల్లో టిడిపి, మిగతా సగం నియోజకవర్గాల్లో బిజెపి, జనసేన సర్దుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే పొత్తుకు సిద్ధమని బిజెపి సంకేతాలు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు అంగీకరించే స్థితిలో టిడిపి లేదు. బిజెపి పట్టుబడితే పొత్తు వదులుకునేందుకు టిడిపి సిద్ధపడుతుందన్న విశ్లేషణ ఉంది. మరోవైపు జనసేన 60 అసెంబ్లీ స్థానాలను డిమాండ్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈనెల ఐదో తేదీలోగా డిసైడ్ కావాలని పవన్ నాదెండ్ల మనోహర్ తో వర్తమానం పంపించినట్లు టాక్ నడుస్తోంది.
అయితే ఇప్పటివరకు 15 నుంచి పాతిక అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్ సభ స్థానాలను జనసేనకు ఇచ్చేందుకు టిడిపి మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరిగింది. ఒకవేళ బిజెపి కూటమిలోకి వస్తే.. ఆ రెండు పార్టీలకు 40 అసెంబ్లీ సీట్లు, పది పార్లమెంట్ సీట్లు కేటాయించేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. అయితే దీనికి బిజెపి ఒప్పుకుంటుందా? లేదా? అన్నది చూడాలి. అసెంబ్లీ స్థానాల వరకు జనసేన ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది. పార్లమెంట్ స్థానాల విషయానికి వచ్చేసరికి బిజెపి ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు ఇచ్చిన సీట్లతో వారుసర్దుబాటు చేసుకునే పరిస్థితి ఉందా?లేదా? అన్నది చూడాలి. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో 50-50 ఫార్ములాకు ఒప్పుకోరని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే కనీసం 50 స్థానాలను జనసేనకు ఇవ్వకుంటే కాపు సామాజిక వర్గంతో పాటు జనసైనికులు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయం పవన్ సైతం చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. కాపులకు, జన సైనికులు సంతృప్తి చెందకుండా ఉంటే ఓట్ల బదలాయింపు సజావుగా జరగదు అన్న విశ్లేషణ సైతం ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? చూడాలి.