Nellore YCP: వైసిపి హై కామాండ్ కు నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ తలనొప్పే. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. 2014 ఎన్నికల్లో సైతం ఏకపక్షంగా నిలిచింది. 2019లో మాత్రం స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా లభించలేదు. అయితే 2024 ఎన్నికలు మాత్రం వైసీపీకి చేదు ఫలితాలు ఇస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. నాయకత్వం పూర్తిస్థాయిలో అదుపు తప్పింది. జిల్లాలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు చేజారారు. తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. అయితే వెళ్లిపోయిన నేతల కంటే.. పార్టీలో ఉన్నవారు ఎక్కువగా తలనొప్పులు తెస్తున్నారు.
గత ఎన్నికల్లో జిల్లాలో అన్ని నియోజకవర్గాలను వైసిపి గెలుచుకుంది. సీనియర్లను కాదని అనూహ్యంగా జూనియర్ అయిన అనిల్ కుమార్ యాదవ్ ను జగన్ తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. కానీ అనిల్ మాత్రం జిల్లాలో సీనియర్లను ఖాతరు చేయకుండా నిత్యం జగన్ భజన చేసేవారు. తన మంత్రి పదవి శాశ్వతమని భావించారు. కానీ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి నుంచి తప్పించి కాకాని గోవర్ధన రెడ్డిని తీసుకున్నారు. అప్పటినుంచి పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. ఆనం రామనారాయణ రెడ్డి సైతం పక్కకు తప్పుకున్నారు. ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఏకంగా తిరుగుబాటు బావుట ఎగురవేశారు. అటు మంత్రి పదవిని పోగొట్టుకున్న అనిల్ కుమార్ ఒంటరి అయ్యారు. కాకాని గోవర్ధన్ రెడ్డి రివేంజ్ ప్రయత్నాలను ప్రారంభించారు. జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా వైసిపి మంచి స్థితిలో లేకుండా పోయింది.
కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతంగా కనిపించారు. ఆయన నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులు లేవని భావించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మరోసారి గెలుపొందుతారని అంచనా వేశారు. కానీ ఆయనపై సొంత తమ్ముడే ధిక్కార స్వరం వినిపించారు. ఏకంగా ఒక వీడియోను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రసన్నకుమార్ రెడ్డికి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని తమ్ముడు రాజేంద్రనాథ్ రెడ్డి చెబుతున్నారు. నియోజకవర్గాన్ని నాయకులకు అమ్మేసారని కూడా ఆరోపణలు చేశారు. దీంతో కొవ్వూరు నియోజకవర్గం సైతం చేజారినట్టేనని వైసీపీ హై కమాండ్ అనుమానిస్తోంది. మరోవైపు నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ కు వ్యతిరేకంగా ఆయన బాబాయ్ రూప్ కుమార్ పావులు కదుపుతున్నారు. ఇప్పుడు కొవ్వూరులో సైతం సొంత కుటుంబంలోనే చిచ్చు రేగింది. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసిపికి దారుణమైన దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఈ అంతర్గత సమస్యలను జగన్ పరిష్కరిస్తారా? లేదా? అన్నది చూడాలి.