Indian Bison: ఏపీలో అటవీ శాఖ( Forest Department) కీలక నిర్ణయం తీసుకుంది. అడవుల్లో అరుదైన, అంతరించిపోతున్న పక్షులు, పశువులను తిరిగి సంరక్షించాలని భావిస్తోంది. అంతరించిపోతున్న అడవి దున్నల సంరక్షణ కోసం సిద్ధమయింది. గౌర్ గా పిలిచే అడవి దున్నలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రస్తుతం ఏపీలో అంతరించిపోతున్న జాతిగా ఇది మిగిలింది. అందుకే నల్లమల అడవుల్లో దేశీయ అడవి దున్నలను తీసుకురావాలని నిర్ణయించారు. మూడు నుంచి నాలుగు బ్యాచ్ లుగా అడవి దున్నలను తీసుకువచ్చేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. 2024 జనవరిలో పశ్చిమ కనుమల ప్రాంతం నుంచి ఒక అడవి దున్న వందల కిలోమీటర్లు ప్రయాణించి.. పాపికొండల అటవీ ప్రాంతం మీదుగా నల్లమల లో ప్రవేశించింది. దీంతో నల్లమల అడవులలో అడవి దున్నల పునరాగమనంపై అనేక ఆశలు చిగురించాయి. అందుకే ఇప్పుడు అడవి దున్నల సంఖ్యను పెంచాలని ఏపీ అటవీ శాఖ నిర్ణయం తీసుకుంది.
పవన్ కళ్యాణ్ చొరవతో..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( AP deputy CM Pawan Kalyan) అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక అనేక రకాలుగా మార్పులు వచ్చాయి. పాపికొండలు, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి మూడు విడతలుగా ఒక్కోసారి 40 చొప్పున మొత్తం 120 దున్నలను తీసుకురానున్నారు. ఈ దున్నల సంరక్షణ కోసం వంద ఎకరాల అటవీ విస్తీర్ణంలో ఒక ప్రత్యేక ఎన్ క్లోజర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్ క్లోజర్లో దున్నల మెడకు సాటిలైట్ పరికరాలను అమర్చుతారు. దీని ద్వారా వాటి ఆరోగ్యం, అవి ఎక్కడ ఉన్నాయి? ఎలా ఉన్నాయి అనే విషయాలను నిరంతరం పర్యవేక్షిస్తారు. ముందుగా వాటిని ఈ వాతావరణానికి తగ్గట్టు ఉండేలా చేస్తారు. నెల రోజులపాటు ఎన్ క్లోజర్ లో ఉంచి అనంతరం అడవిలో విడిచి పెడతారు.
ఇండియన్ బైసన్ గా ప్రసిద్ధి..
భారతదేశంలో అడవి దున్నలకు ప్రత్యేకత ఉంది. ఇండియన్ బైసన్ గా( Indian byson) కూడా పిలుస్తారు. ఇవి 800 కిలోల బరువు ఉంటాయి. సింహాలను సైతం ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటాయి. 1867 నాటికి భారత దేశంలో వేలాదిగా అడవి దొంగలు ఉండేవి. 20వ శతాబ్దంలో కనుమరుగైన జాబితాలో చేరాయి. ప్రధానంగా గాలికుంటు వంటి వ్యాధులతో ఇవి అంతరించినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కనుమరుగైన ఒక పశు జాతిని సంరక్షించే పనిలో పడింది ఏపీ ప్రభుత్వం.