MP Avinah Reddy : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్.. అత్యున్నత దర్యాప్తు సంస్థ. ఏ స్టేట్ కి వెళ్లినా అక్కడ పోలీస్ శాఖలు ప్రాధాన్యమివ్వాలి. వారు కోరితే రక్షణ కల్పించాలి. దర్యాప్తునకు సహకరించాలి. కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు. వివేకా హత్య కేసులో సీబీఐ తిరిగి బాధితవర్గంగా మారిపోయింది. అవినాష్ రెడ్డి విషయంలో అది తేటతెల్లమైంది. ఓ రేంజ్ లో ఆయన సీబీఐతో ఆడేసుకుంటున్నారు. దర్యాప్తునకు సహకరించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నా నిస్సహాయ స్థితిలోకి సీబీఐ వెళ్లిపోవడం విశేషం. అయితే ఇప్పుడే కాదు. కేసు విచారణ ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి. చివరకు దర్యాప్తు చేస్తున్న వారే ఫ్యాక్షన్ బెదిరింపులకు బాధితులుగా మిగిలారు.
అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారన్న ప్రచారం ఉంది. అదే జరిగితే ఆయన ఇతర రాష్ట్రాల్లో తలదాచుకోవాలి. ఆయన ఏపీలో ఉంటున్నారు. ఏపీలోనే తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్నంత సేఫ్ మరి ఎక్కడా ఉండదని భావిస్తున్నారు. నిన్న హైదరాబాద్ నుంచి తిరిగి పులివెందుల బయలుదేరిన ఆయన కర్నాటకలోని ఓ ఆస్పత్రిలో చేరారు. వైసీపీ నేతలకే చెందిన కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో తల్లిని చికిత్స కోసం చేర్పించిన అవినాష్ రెడ్డి… తాను కూడా లోపలే ఉండిపోయారు. ఆ చుట్టుపక్కల మీడియాను రానివ్వడం లేదు. పులివెదుల నుంచి వచ్చిన అవినాష్ అనుచురులు విశ్వభారతి ఆస్పత్రిని..ఓ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నట్లుగా మార్చేశారు.
మరో వైపు సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి మరో నోటీసు జారీ చేశారు. 22వ తేదీన ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి దగ్గరకు చేరే అవకాశం ఇప్పుడు సీబీఐ అధికారులకు లేదు. ఆయనను కర్నూలు వరకూ వెంబడించిన సీబీఐ అధికారులు నిన్ననే పరిస్థితుల్ని గమనించి కర్నూలు నుంచి వెళ్లిపోయారు. ఉన్నతాధికారుల్ని సంప్రదించి ఏం చేయాలా అని చర్చించి.. చివరికి మరో చాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు కూడా. అయితే ఈ నెల 22న సీబీఐ విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు జారతీచేసినట్టు తెలుస్తోంది.
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయంగా భావించుకున్న సీబీఐ తల్లి సెంటిమెంట్ పెట్టేసరికి కాస్తా మెత్తబడింది. తల్లికి అనారోగ్యమని చెప్పినందున మరో చాన్స్ ఇవ్వడం మంచిదని సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే అవినాష్ రెడ్డి మాత్రం సీబీఐ విచారణకు హాజరవడానికి ఏ మాత్రం సుముఖంగా లేరు. అరెస్ట్ చేయరు అనే హామీ ఇస్తే మాత్రమే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ న్యాయపరంగా అన్ని అవకాశాలు ఇప్పటికే మూసుకుపోయాయి. సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పటికైనా చేస్తుంది. కానీ ఎందుకో ఆలోచిస్తోంది. నోటీసులు ఇస్తోంది. అయితే ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప అవినాష్ అరెస్ట్ తప్పదు. అటువంటప్పుడు ఈ సిల్లీ రీజన్స్ ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్న. ఎలాగూ ఏపీ పోలీసులు తమ వారే కనుక కొద్దిరోజుల పాటు అవినాష్ దీనినే కంటిన్యూ చేసే చాన్స్ ఉంది.