Chandrababu: చంద్రబాబు తదుపరి కార్యాచరణ ఏంటి? ఈనెల 29 నుంచి ప్రజల్లోకి వెళ్తారా? ఎక్కడ అరెస్టు చేశారో.. అక్కడి నుంచి పోరు మొదలు పెడతారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి ప్రకటన వెల్లడి కాలేదు. అయితే తనది అక్రమ అరెస్టు అని.. ప్రజల్లో సానుభూతి దక్కించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి తేల్చుకోవాలని చూస్తున్నారు. దీంతో సానుభూతి వర్కౌట్ అవుతుందా? ఒకవేళ అయితే మాత్రం టిడిపికి మైలేజ్ వచ్చినట్టే. లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
అయితే చంద్రబాబు విషయంలో సానుభూతి పెద్దగా వర్కౌట్ కాలేదు. 2004లో చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేశారు. ఆ ప్రమాదం నుంచి చంద్రబాబు బయటపడ్డారు. అప్పటికే రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర, టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత ను గమనించిన చంద్రబాబు.. తనపై నక్సలైట్ల దాడితో సానుభూతి పనిచేస్తుందని భావించారు. తొమ్మిది నెలల ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. అలా వెళ్తూ వెళ్తూనే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని సైతం రద్దు చేయించారు. బిజెపితో కలిసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లారు. కానీ ఎటువంటి సానుభూతి పనిచేయలేదు. ఆ ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమికి దారుణ పరాజయం ఎదురైంది.
2019 ఎన్నికల్లో సైతం ఇదే తరహా సానుభూతిని చంద్రబాబు ఆశించారు. 2014 ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేసి విజయం సాధించారు. అవశేష ఆంధ్రప్రదేశ్ కు బిజెపి సహకరిస్తుందని భావించారు. 2018 వరకు బిజెపితో సన్నిహితంగా మెలిగారు. అటు రాష్ట్రానికి ఎటువంటి ప్రత్యేక కేటాయింపులు చేయకపోగా.. బిజెపి వైసీపీకి సహకరిస్తుందని అనుమానించారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ ట్రాప్ లో పడ్డారు. బిజెపితో స్నేహాన్ని వదులుకున్నారు. అక్కడితో ఆగకుండా వైరం పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఈ రాష్ట్రానికి బిజెపి దారుణంగా వంచిందని.. ఏపీ ప్రజల నుంచి సానుభూతి పొందాలని చూశారు. కానీ 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీని దారుణంగా ఓడించారు. అప్పుడు కూడా సానుభూతి పెద్దగా వర్కౌట్ కాలేదు.
ఇప్పుడు ఎన్నికల ముంగిట తనను అరెస్టు చేశారని.. అవినీతి కేసులు పెట్టారని.. మీకోసం పోరాడుతుంటే తనను టార్గెట్ చేశారని.. చంద్రబాబు మరోసారి ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నారు. ఈనెల 30 తర్వాత చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి మాత్రం ప్రజల నుంచి సానుభూతి పొంది.. మరోసారి అధికారం దిశగా వెళ్లాలని గట్టి ప్రణాళికలే రూపొందిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం రాజకీయ కక్షతో తనపై కేసులు నమోదు చేశారని చెప్పి.. ప్రజల నుంచి సానుభూతి పొందాలని చూస్తున్నారు. ఈసారైనా వర్కౌట్ అవుతుందో? లేదో? చూడాలి.