Jagan and KTR: ప్రజల్లో మార్పు తీసుకొస్తేనే ఏదైనా ఒక రాజకీయ పార్టీకి గుర్తింపు వస్తుంది. అంతేకానీ తన అభిప్రాయాన్ని ప్రజలపై రుద్దడం కూడా తగదు. ప్రజలలో భావోద్వేగం రేపితేనే మంచి ఫలితాలు వస్తాయి. తాము భావోద్వేగానికి గురై మాట్లాడితే మాత్రం ప్రతికూల ఫలితాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతలు ఇప్పుడు అదే అంశం చుట్టూ చిక్కుకున్నారు. ప్రజలలో భావోద్వేగాలను రేపడం మరిచి.. తమలో ఉన్న భావోద్వేగాలను బయట పెడుతున్నారు. తెలంగాణలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే మాదిరి తో వ్యవహరిస్తున్నారు. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి అదే ధోరణితో ఉన్నారు. ఇద్దరూ నేల విడిచి సాము చేస్తున్నారు.
కెసిఆర్ సక్సెస్..
తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లి సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు కెసిఆర్. ఆయన ప్రారంభంలో అంత ప్రభావం చూపలేకపోయారు. కానీ ప్రజల్లో భావోద్వేగం రేపడంలో మాత్రం సక్సెస్ అవుతారు. ఆయన సక్సెస్ మంత్రం కూడా అదే. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నిలపడం ద్వారా తెలంగాణలో అధికారంలోకి రాగలిగారు. అంతకుముందు ఉద్యమాన్ని నడపగలిగారు. అయితే ఎప్పుడైతే ఆయన ప్రజల భావోద్వేగాలను మరిచిపోయారో అప్పుడే గులాబీ పార్టీకి ఓటమి ఎదురైంది. అయితే తండ్రి రాజకీయ వారసత్వంగా కేటీఆర్ ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. కానీ ఇటీవల కేటీఆర్ వాడుతున్న భాష ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి విషయంలో బ్లాస్ట్ అవుతున్నారు. ప్రజల్లో భావోద్వేగం కంటే వ్యతిరేకతను పెంచుకుంటున్నారు.
గుణపాఠాలు నేర్చుకొని జగన్
వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాదిరిగా ఉన్నారు. ఆయనపై ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం ఉంది. విధ్వంసం అనే అంశం చుట్టూ రాజకీయం నడిచింది మొన్నటి ఎన్నికల్లో. తటస్థులతో పాటు విద్యాధికులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలతో పాటు చర్యలను వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు కూడా ఆ పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదు. రప్పా రప్పా నరికేస్తాం అన్న హెచ్చరికలు ఆ పార్టీకి ఇబ్బందికరమే. ఎందుకంటే ఆ భయంతోనే ఆ పార్టీని గద్దె దించారు. ఇప్పుడు అవే తరహా హెచ్చరికలు మాత్రం ఆ పార్టీకి నష్టం. ప్రజల్లో భావోద్వేగాలు నింపాలే తప్ప.. భయపెట్టకూడదు అన్న విషయాన్ని తెలుసుకోకపోవడం నిజంగా మైనస్.