Election Manifesto : టీడీపీ మేనిఫెస్టో ఫ్రేమ్ బయటకు వచ్చింది. ఆసక్తికరమైన పథకాలు తమ అమ్ములపొదిలో ఉన్నాయని చంద్రబాబు ప్రకటించారు. జగనే కాదు..తానూ ఇవ్వగలనని తేల్చిచెప్పారు. అప్పుడే పథకాల ప్రచారంలో టీడీపీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. అభివృద్ధి, సంక్షేమం కావాలంటే బాబు రావాలన్న స్లోగన్స్ కు పదునుపెడుతున్నాయి. ఎన్నికలకు పది నెలల వ్యవధి ఉండగా టీడీపీ మేనిఫెస్టోతో పొలిటికల్ హీట్ పెంచేసింది. ప్రస్తుతానికైతే.. టీడీపీ పథకాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. అదే సమయంలో చాలా ప్రశ్నలకు ఇంకా చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. పథకాల అమలుకు నగదు, వాటి అమలుకు వలంటీరులాంటి వ్యవస్థ తీసుకొస్తారా? అన్న సందేహాలకు నివృత్తి చేయలేదు. కానీ ఇంకా పూర్తిస్థాయి మేనిఫెస్టో వస్తుందని.. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని చెప్పడం ద్వారా చంద్రబాబు అర్ధవంతమైన మెసేజ్ ను ఇవ్వగలిగారు.
ఇప్పటివరకూ చంద్రబాబు అభివృద్ధి అన్న నినాదంతోనే ముందుకెళ్లారు. ఇప్పుడు సంక్షేమ బాట పట్టడంతో టీడీపీ శ్రేణులు సైతం పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలను ఆకర్షించే పథకాలు ప్రకటించడంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.తాము అధికారంలోకి వచ్చేసినంత ఆనందంలో తేలియాడారు టీడీపీ శ్రేణులు. సోషల్ మీడియాలో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అయితే మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా ప్రజలు మాత్రం మీ వైపు చూసేది లేదని వైసీపీ చెబుతోంది. తమపైనే ప్రజలకు అపార నమ్మకం ఉంటుందని గట్టిగా వాదిస్తోంది.
వైసీపీ సర్కారుకు ఉన్న అదనపు బలం వలంటీరు వ్యవస్థ. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, పౌరసేవలను అందిస్తున్నారు. నాలుగేళ్లుగా తమకు పథకాలు అందట్లేదని ఎవరూ కంప్లైంట్స్ ఇవ్వలేదు. అంతేకాదు..వలంటీర్ల పుణ్యమా అని పథకాల అమలు విషయంలో అవినీతి అన్నదే జరగట్లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. పథకాల లబ్ది పొందుతున్నవారంతా తిరిగి తమనే గెలిపిస్తారని వైసీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మహానాడులో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. మేనిఫెస్టో ద్వారా శాంపిళ్లను ప్రకటించారు. అంచనాలు పెంచారు. కానీ పథకాల ప్రయోజనాలను ప్రజలకు ఎలా చేరవేస్తారు? ఎలా అమలుచేస్తారు? ఇప్పటిలా బటన్ నొక్కుడుకు ప్రాధాన్యమిస్తారా? అంశాలపై చంద్రబాబు మాట్లాడలేదు. ప్రజల్లో ఒక రకమైన చర్చకు మాత్రం తెరలేపారు. ప్రజా స్పందనను అనుసరించి ఆ పథకాలకు మరింత మెరుగులు దిద్దాలా? కొత్త పథకాలపై దృష్టిపెట్టలా? అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.