KCR, JAGAN : రాజకీయ స్నేహితులు కేసిఆర్, జగన్ పయనం ఎటు? ఎన్డీఏ కూటమిలో చేరుతారా? ఇండియా కూటమిని ఆశ్రయిస్తారా?ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటారా?లేకుంటే వేర్వేరు మార్గాల్లో వెళ్తారా?తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తోంది.దాదాపు ఇద్దరి పరిస్థితి అలానే ఉంది.2018 ఎన్నికల్లో ఓడిపోయారు కేసీఆర్. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. దీంతో తెలంగాణలో కెసిఆర్ పార్టీ మనుగడ కూడా కష్టమవుతోంది. ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి చేరికలు పెరిగాయి. ఏకంగా ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి క్యూపడుతున్నారు. మరోవైపు కుమార్తె కవిత అవినీతి కేసుల్లో చిక్కుకొని జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఏపీలో కూడా జగన్ పరిస్థితి అలానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. 11 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది. కనీసం జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అక్రమాస్తుల కేసులు, బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య అంశం తెరపైకి వస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులపై దాడులు,కేసులు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో పార్టీని కాపాడుకోవడం ఇబ్బందికరమే. అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ శత్రువులను పెంచుకున్నారు ఈ ఇద్దరు నేతలు. సొంత రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలో నమ్మదగిన స్నేహాన్ని కొనసాగించలేకపోయారు. దాని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. తాము ఇబ్బందుల్లో ఉన్న పట్టించుకునే వారు కరువయ్యారు. కనీసం మద్దతు తెలిపేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి. అందుకే వీరిద్దరూ పునరాలోచనలో పడ్డారు. జాతీయస్థాయిలో స్నేహం పెంచుకోవాలని చూస్తున్నారు.
* ఇద్దరు నేతల్లో భయం
ఈ ఇద్దరు నేతలకు ఇప్పుడు జమిలి ఎన్నికల భయం పట్టుకుంది. 2019 నుంచి కార్యాచరణ ప్రారంభించింది బిజెపి. కానీ 2024 ఎన్నికలకు ఒక ఏడాది ముందు జమిలి ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ ప్రారంభమైంది. సాధ్యాసాధ్యాలపై ఒక కమిటీని వేసింది కేంద్రం. ఈ కమిటీకి అధ్యక్షుడిగా మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ని నియమించింది. ఆయన నాయకత్వంలో కమిటీ ఇప్పటికే చాలాసార్లు భేటీ అయింది. 2029 నాటికి దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు. అదే జరిగితే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. జాతీయ పార్టీల ప్రభావం ప్రాంతీయ పార్టీలపై తప్పకుండా పడుతుంది.
* కూటమిల మధ్య ఫైట్
ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ కంటే.. కూటమిల మధ్య గట్టి ఫైట్ నెలకొనే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో జగన్, కెసిఆర్ ఏదో ఒక కూటమిలో చేరక తప్పని పరిస్థితి. ఇప్పటికే ఏపీలో ఎన్డీఏ కూటమిలో టిడిపి, బిజెపి, జనసేన ఉన్నాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు కొనసాగుతున్నాయి. ఏ కూటమిలో చేరకుండా వైసిపి ఉంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇండియా కూటమికి చెందినది. బిజెపి ఎన్డీఏ కు నేతృత్వం వహిస్తోంది. దీంతో అక్కడ ఏ కూటమికి చెందినది కేసీఆర్ పార్టీ.
* ఇప్పటి నుంచే సయోధ్య?
2029లో జమిలి ఎన్నికలు జరిగితే.. జగన్ ఇప్పటినుంచే కార్యాచరణ ప్రారంభించాలి.ఎన్డీఏలో టిడిపి, జనసేనలు బలమైన పక్షాలు కావడంతో ఆ కూటమిలో చేరేందుకు జగన్ కు చాన్స్ లేదు. అందుకే ఆయనకు ఏకైక ఆప్షన్ ఇండియా కూటమి. కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ఎన్నికలకు సిద్ధం కావడమే ఆయన ముందున్న కర్తవ్యం. కెసిఆర్ ది మరీ విచిత్ర పరిస్థితి. తెలంగాణలో ఆ పార్టీ ఏ కూటమిలో చేరాలనుకున్నా అధికారం ఆశించే పరిస్థితిలో లేదు. కేవలం సర్దుబాటు వరకు మాత్రమే చేయగలదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కెసిఆర్ తో పాటు జగన్ రాజకీయ కార్నర్ లో ఉన్నట్టే.