Highest Circulated Newspapers: సరిగా కొన్ని నెలల క్రితం తన పత్రిక లో పనిచేస్తున్న కీలక సిబ్బందితో కలిసి ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ జిల్లాలలో పర్యటించారు. సిబ్బందితో మాట్లాడారు. “ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేరుగా వార్తలు రాసేయండి. అధికార పక్షం, ప్రతిపక్షం అని తేడా ఉండకూడదు. ఆధారాలు ఉంటే మాత్రమే వ్యతిరేక వార్తలు రాయండి. వ్యతిరేకం అంటే గుడ్డిగా రాయకూడదు.. జనం మూడ్ ఆధారంగా వార్తలు రాయండి. వార్తల్లో మీ వ్యక్తిగత లక్ష్యాలు ఉండకూడదు” అని హిత బోధ చేశారు. వాస్తవానికి పత్రికాధిపతిగా వేమూరి రాధాకృష్ణ చెప్పిన మాటలు ఆమోదయోగ్యమైనవి. సిబ్బందికి ఆ స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ ఆంధ్రజ్యోతి ఇప్పటికి అదే మూడో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. జగన్ స్థానాన్ని కొట్టేయాలి.. జగన్ పత్రిక స్థానంలో నిలబడాలి అని రాధాకృష్ణ అనుకుంటున్నప్పటికీ అది ఇప్పట్లో నెరవేరే అవకాశం కల్పించడం లేదు.
సర్కులేషన్ ఎలా పెరిగింది
న్యూస్ చానల్స్, ఎంటర్టైన్మెంట్ చానల్స్ కు బార్క్ రేటింగ్స్ ఉన్నట్టే.. వార్తాపత్రికలకు కూడా ఏ బి సి అనే వ్యవస్థ ఉంటుంది. ఇది వార్తాపత్రికల సర్కులేషన్ నిర్ధారిస్తుంది. తాజా లెక్కల ప్రకారం అంటే ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు వార్తాపత్రికల అమ్మకాలను.. వాటి వివరాలను ఏబిసి వెల్లడించింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 2.77 శాతం పత్రికల అమ్మకాలు పెరిగిపోయాయని ఏ బి సి చెబుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముద్రణ మాధ్యమానికి ఇది మంచి వార్త. కాకపోతే ఏ బీసీ ఇచ్చిన నివేదికను చూస్తే అన్ని పెద్ద మీడియా హౌస్ ల పత్రికల అమ్మకాలు కొంత మేర తగ్గిపోయాయి. అలాంటప్పుడు పెరుగుదల ఎలా సాధ్యమవుతుందో ఏబీసీకే తెలియాలి.
ఏబిసి నివేదిక ప్రకారం
ఏబీసీ ఇచ్చిన నివేదిక ప్రకారం తెలుగులో ఇప్పటికీ ఈనాడు మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ పత్రిక లో పనిచేసే కీలక వ్యక్తులు తమ పనితనాన్ని పక్కన పెట్టినప్పటికీ.. ఈనాడు తన స్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. అయితే ఇక్కడ సాక్షికి, ఈనాడుకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలావరకు తగ్గిపోతోంది. ప్రస్తుతం ఈ రెండు పత్రికల మధ్య తేడా జస్ట్ 1.73 లక్షల కాపీలు మాత్రమే. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. ఇక సాక్షిని కొట్టాలి అని రాధాకృష్ణ ఎప్పటినుంచో అనుకుంటున్నాప్పటికీ.. అది ఇప్పట్లో సాధ్యమయ్యే పనిలాగా కనిపించడం లేదు. అటు చంద్రబాబు ఎమ్మెల్యేల మీద.. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల మీద ఏ స్థాయిలో మసాలా వార్తలు రాసినప్పటికీ ఎందుకనో రాధాకృష్ణ పత్రిక మూడో స్థానంలోనే ఉండిపోతుంది.. సర్కులేషన్ ప్రకారం చూసుకుంటే ఈనాడు ఒకప్పుడు 14.88 లక్షలు ఉంటే.. ఇప్పుడు ఏకంగా 11.82 లక్షలకు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి జిల్లాలలో సాక్షి ఈనాడు కంటే అప్పర్ హ్యాండ్ లో ఉంది. మిగతా జిల్లాల్లో కూడా ఈనాడుతో నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతోంది. సాక్షి మీద గతంలో ఈనాడు చేసిన పోరాటం.. కోర్టులోకి ఎక్కిన తీరు.. ఇవేవీ కూడా ఆపత్రికను ఇబ్బంది పెట్టలేకపోతున్నాయి. ఒక రకంగా ఏపీలో సాక్షి ఎఫెక్టివ్ రోల్ ప్లే చేస్తోంది.
తెలంగాణలో ఈనాడు నెంబర్ వన్
తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఈనాడు గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక్కడ సాక్షి అత్యంత బలహీనంగా ఉంది. రకంగా అది వార్తల విషయంలో నమస్తే తెలంగాణతో పోటీపడుతోంది. అందువల్ల జనం సాక్షిని అంతగా దేకడం లేదు. ఇవాల్టికి రేవంత్ మీద నెగిటివ్ స్టాండ్ తో ఉండడం.. కెసిఆర్ అంటే నమస్తే తెలంగాణ కంటే మించి భజన చేయడం సాక్షికి అలవాటుగా మారిపోయింది..
మూడో స్థానంలోనే ఉండిపోయింది..
ఇక ఆంధ్రజ్యోతి ఎప్పటిలాగానే అక్కడ ఇక్కడ మూడో స్థానంలో ఉంది. కాకపోతే దాని సర్కులేషన్ ఊహించినంత గొప్పగా ఉండడం లేదు. కొన్ని జిల్లాల్లో అయితే 20,000 కంటే తక్కువ సర్కులేషన్ ఉంది. ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో ఆంధ్రజ్యోతి సర్కులేషన్ దారుణంగా ఉంది. అయితే ఇక్కడ ఖమ్మం లో మాత్రం ఆ పత్రిక యాడ్ రెవెన్యూ సాక్షి కంటే ఎక్కువగా ఉంది. తాజా రేటింగ్స్ ఇంకా చాలా విషయాలు చెబుతున్నాయి. సాధ్యమైనంత వరకు ఒక పత్రిక ప్రతిపక్షంగా ఉంటే జనం ఆదరిస్తారు. కానీ ఏ బి సి రేటింగ్స్ చూస్తే అలా కనిపించడం లేదు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి సపోర్ట్ గా ఉన్నాయి. అలాగని అవి కోల్పోయింది లేదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి అండగా ఉన్నాయి. అలాగని ఇక్కడ కూడా అవి రెండు నష్టపోయింది లేదు.
మొత్తంగా చూస్తే..
మొత్తంగా చూస్తే పత్రికల మాదిరిగానే రీడర్స్ కూడా డివైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇక మిగతా వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆల్రెడీ ఏ బి సి నుంచి బయటికి వెళ్లిపోయింది కాబట్టి నమస్తే గురించి చెప్పుకోవడం దండగ. ఎందుకంటే జనం ఎవడూ చదవడం లేదని.. ఇజ్జత్ మొత్తం పోతుందని ఆ పత్రిక యాజమాన్యానికి తెలుసు. అందువల్లే ఏ బి సి లో ఆపత్రిక ఉండదు.