Ram Gopal Varma compromised: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( director Ram Gopal Varma) లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గుర్తించిన దర్శకుడు వర్మ. తొలుత తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. తరువాత బాలీవుడ్ లో సైతం తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నారు. అటువంటి వర్మ పొలిటికల్ లైన్ లోకి వెళ్లారు. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిని మెప్పించేందుకు పొలిటికల్ సెటైరికల్ మూవీలు తీశారు. అంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులను సైతం సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టారు. ఒక పేరు మోసిన దర్శకుడు నన్న విషయాన్ని హాలీవుడ్ స్థాయిలో చిల్లర వేషాలు వేశారు. తనను తాను తగ్గించుకున్నారు. ఒక క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు పొందిన ఆయన వివాదాస్పదముద్ర వేసుకున్నారు. ఇప్పుడు దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా అభినందించారు.
భారత చిత్ర పరిశ్రమలో గుర్తింపు..
తెలుగు చిత్ర పరిశ్రమలో( Telugu cinema industry) శివ సినిమా ద్వారా ప్రవేశించారు రాంగోపాల్ వర్మ. నాగార్జునకు ఒక విజయవంతమైన సినిమా అందించగలిగారు. తెలుగు సినిమా ట్రెండ్ ను మార్చారు రామ్ గోపాల్ వర్మ. అనతి కాలంలోనే వైవిద్య భరితమైన సినిమాలకు దర్శకత్వం అందించి తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. తన ప్రతిభ కేవలం తెలుగుకే కాదు.. హిందీ భాషలో సైతం అద్భుత విజయాలను దక్కించుకొని ఇండియన్ సినిమా హిస్టరీలో తన పేరును నిలుపుకున్నారు. కానీ అటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పటడుగులు వేశారు. రాజకీయాల వైపు దృష్టి మళ్లించారు. అలాగని నేరుగా కాదు. జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచి సినిమాలు తీశారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను తూలనాడారు. మెగా ఫ్యామిలీ పై విరుచుకుపడేవారు. అటువంటి ఆర్జీవి లో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
కూటమి వచ్చిన తర్వాత సైలెంట్..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫుల్ సైలెంట్ అయ్యారు రాంగోపాల్ వర్మ. కేసులను సైతం ఎదుర్కొని ఒకానొక దశలో అరెస్టు అవుతారని ప్రచారం నడిచింది. స్టేషన్ల చుట్టూ తిరుగుతూ.. కోర్టుల ద్వారా ఉపశమనం పొందారు. అయితే ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ రాజీ పడ్డారన్న ప్రచారం నడిచింది. అందుకే కూటమి ప్రభుత్వం ఆయన విషయంలో వెనక్కి తగ్గినట్లు టాక్ నడిచింది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ఏకంగా క్షమాపణలు చెప్పారు. మంచి మనిషిగా అభివర్ణించారు. ఆయన కుమారుడు రామ్ చరణ్ విషయంలో అడ్డగోలుగా మాట్లాడే ఆయన.. ఫస్ట్ టైం అభినందించారు. కచ్చితంగా తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. ఇంతకుముందే ఇకనుంచి రాజకీయ చిత్రాలు చేయను.. రాజకీయ వ్యాఖ్యలు చేయను అంటూ ప్రకటన చేశారు రామ్ గోపాల్ వర్మ. దానికి కట్టుబడి ఉన్నారు కూడా. అయితే ఈ మార్పు వెనుక ఏదో జరిగిందన్న అనుమానం ఉంది. దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. బహుశా కొందరు సినీ పెద్దలు రంగప్రవేశం చేసి రాజీ చేసి ఉంటారన్న టాక్ మాత్రం వినిపిస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.