E Governance Services AP: ఏపీలో ( Andhra Pradesh) సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పాలన అంటే కేవలం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కాదు. ప్రజలకు మెరుగైన పౌర సేవలను అందించాలనుకుంటుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ పక్కాగా అమలు చేయాలని చూస్తోంది. సాధారణంగా పౌర సేవలు అనేవి కార్యాలయాలకు వెళ్లి పొందాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆన్లైన్లో నేరుగా అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఓ వంద రకాల సేవలను ప్రారంభించింది. ఈ సంక్రాంతి తర్వాత దాదాపు 500 సేవలు అందించేందుకు సిద్ధపడుతోంది. తద్వారా ప్రజలకు సులువుగా, సులభతరంగా సేవలు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది కూటమి ప్రభుత్వం.
* సులభ పౌర సేవల కోసం..
పౌర సేవల కోసం మరొకరిపై ఆధారపడకుండా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే అన్ని రకాల సేవలను ఈజీగా పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. తిరుమలతో పాటు ప్రముఖ క్షేత్రాల సందర్శన, దేవుడి దర్శనం, ఆర్టీసీ సేవలు, రైల్వే ప్రయాణ రిజర్వేషన్లు, వివిధ ప్రభుత్వ సేవల కోసం స్లాట్ బుకింగ్స్.. ఇలా అన్ని ప్రక్రియలను ఆన్లైన్ విధానంలోనే చేసేందుకు ప్రభుత్వం ఈ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 సేవలు దీని ద్వారా అందుబాటులోకి రానున్నాయి. అదే జరిగితే ప్రజలు ఒకరిపై ఆధారపడకుండానే ఈ సేవలను పొందే వెసులుబాటు కల్పించనుంది ప్రభుత్వం.
* వాట్సాప్ లో హాయ్ చెబితే..
ఇప్పటికే వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిర్దిష్ట వాట్సాప్ నంబర్ కు హాయ్ అని పెడితే మనకు అవసరమైన అన్ని సేవలు పొందవచ్చు. ఇప్పటికే ఈ విధానం ద్వారా విద్యార్థుల హాల్ టికెట్ల జారీ ప్రక్రియ జరిగింది. అదే సమయంలో పరీక్ష ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. ఇదే వాట్సాప్ సేవల ద్వారా తల్లికి వందనంతో పాటు అన్నదాత సుఖీభవ స్టేటస్ తెలుసుకోవడం, అభ్యంతరాలు తెలుసుకోవడం వంటి వాటికి అవకాశం కల్పించారు. అయితే ఇకనుంచి కార్యాలయాలకు వెళ్లి సంప్రదించకుండానే పౌర సేవలు పొందడమే కాదు. వాటికి ఎదురయ్యే ఇబ్బందులు సులువుగా తెలుసుకోవచ్చు. అప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపించవచ్చు. మొత్తానికి అయితే ఈ సంక్రాంతి నుంచి వందలాది పౌర సేవలు ఈజీగా పొందే అవకాశం మాత్రం కనిపిస్తోంది.