Pawankalyan : గోదావరి 34  సీట్లే జనసేన బలం.. పవన్ కింగ్ మేకర్ ఖాయం

పొత్తులు ఉన్నా లేకున్నా 34 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అటు మిగతా ప్రాంతాల్లో సైతం గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకొని కింగ్ మేకర్ గా నిలవాలని భావిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Written By: Dharma, Updated On : June 18, 2023 3:58 pm
Follow us on

Pawankalyan : పోయిన చోటే వెతుక్కోవాలంటారు. ఎక్కడ ఎదురు దెబ్బ తగిలిందో.. అక్కడే గట్టిగా నిలబడాలంటారు. ఇప్పుడు పవన్ చేస్తున్నది అదేనా? ఉభయ గోదావరి జిల్లాల్లో అందుకే వారాహి యాత్ర చేపడుతున్నారా? 34 నియోజకవర్గాలపై ఫోకస్ చేయడం వెనుక కథ వేరే ఉందా? ఇక్కడ వైసీపీకి గెలవనివ్వనని శపధం చేయడం దేనికి సంకేతం? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చనీయాంశంగా మారుతోంది. పవన్ తాజా కామెంట్స్ పై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలపై పట్టు కోసం పవన్ ప్రయత్నిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ప్రయత్నం సక్సెస్ అయితే మాత్రం పవన్ కింగ్ మేకర్ కావడం ఖాయమని తేల్చిచెబుతున్నారు.
గత ఎన్నికల్లో పవన్ రెండుచోట్ల పోటీ చేశారు. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీచేశారు. కానీ రెండుచోట్లా నిరాశే ఎదురైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గం అధికం. అయినా త్రిముఖ పోటీలో పవన్ కు నిరాశే ఎదురైంది. కానీ మెజార్టీ నియోజకవర్గాల్లో టీడీపీకి తోసిరాజని జనసేన అభ్యర్థులు రెండోస్థానంలో నిలిచారు. ఇది ఒకరకంగా విజయంగానే చెప్పుకోవాలి. ప్రధానంగా కాపులు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పవన్ కు కాకుండా జగన్ ను నమ్మారు. కానీ వారి నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకోలేదు. అదే సమయంలో పవన్ ఓటమి చవిచూసినా నిలబడ్డారు. దీంతో కాపుల్లో రియలైజ్ మొదలైంది. జనసేన వైపు పోలరైజ్ కావడం కనిపించింది. కాపులతో పాటు క్షత్రియులు, బీసీలు సైతం జనసేన వైపు చూస్తుండడంతో గోదావరి జిల్లాల్లో జనసేన బలీయమైన శక్తిగా మారింది.
ఉభయ గోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాలున్నాయి. ఇందులో మెజార్టీ నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు ఆ స్థానాలను గెలుచుకుంటుంది అంటే.. అంత సీన్ లేదని సమాధానం వస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరినా.. పవన్ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. గోదావరి జిల్లాల తరవాత విశాఖ, కృష్ణా జిల్లాల్లో సీట్లు కోరే చాన్స్ ఉంది. ఒక వేళ పొత్తు కుదరకుంటే ఒంటరిగానైనా పోటీచేసేందుకు పవన్ సిద్ధపడతారని సమాచారం. అందులో భాగంగానే ఆయన తనకు అత్యంత బలముందని భావిస్తున్న ఉభయగోదావరి జిల్లాలపై ఫోకస్ పెంచారు. అక్కడ వైసీపీని గెలవనివ్వనని చెబుతున్నారు.
అయితే పవన్ సరికొత్త డిమాండ్ పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. వైసీపీకి గెలవనివ్వనని మాత్రమే చెబుతున్నారని.. అక్కడ జనసేన గెలుస్తుందని ఎందుకు చెప్పలేకపోతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకా పొత్తులపై నిర్ణయం తీసుకోలేదని భావిస్తున్న పవన్ ఆది నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెబుతున్నారు. అందుకే పొత్తు అంశాన్ని సజీవంగా ఉంచుతూనే 34 నియోజకవర్గాలపై స్పష్టమైన ప్రకటన చేశారు. పొత్తులు ఉన్నా లేకున్నా 34 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అటు మిగతా ప్రాంతాల్లో సైతం గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకొని కింగ్ మేకర్ గా నిలవాలని భావిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.