Free Bus Travel: ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పింఛన్ల మొత్తాన్ని పెంచారు. పెంచిన పింఛన్లను ఈనెల 1న అందించగలిగారు. మిగతా హామీలపై కూడా దృష్టి పెట్టారు. త్వరలో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 1500 రూపాయల నగదు ఇవ్వనున్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను 10 లక్షల రూపాయలకు పెంచారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పై కీలక ప్రకటన చేశారు. ఉచిత ప్రయాణం అమలుకు సంబంధించి కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. అందులో కీలకమైనది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. తొలుత కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించింది. దీంతో అక్కడ ప్రజలు ఆదరించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ హామీ ఇచ్చింది. అక్కడ కూడా అధికారంలోకి రాగలిగింది. దీంతో చంద్రబాబు ఇదే హామీని ఏపీలో కూడా ప్రకటించారు. ఇక్కడ కూడా మహిళలు ఆదరించారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే ఈ పథకం యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. పథకం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అమలు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఎందుకు సంబంధించి ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తాజాగా ఒక పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రజా ప్రభుత్వంతో పాటు మరో సంక్షేమ నిర్ణయం అంటూ వివరాలు వెల్లడించారు.
ప్రభుత్వం కీలక హామీలను అమలు చూసేందుకు సిద్ధపడుతోంది. వీలైనంత త్వరగా వాటికి అమలు చేసి ప్రజాధరణ పొందాలని భావిస్తోంది. పింఛన్ల పెంపు పథకాన్ని అమలు చేసి చూపించింది. కీలకమైన ఐదు పథకాలను వెంటనే అమలు చేసేందుకు సైతం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్ల పెంపుతో పాజిటివిటీని పెంచుకుంది. డీఎస్సీ ప్రకటనతో నిరుద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. ఇంకోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి రైతుల్లో ఉన్న అపనమ్మకాన్ని తొలగించింది. తల్లికి వందనం పథకానికి సిద్ధంగా ఉండాలని.. అందుకు సంబంధించి పత్రాలను సిద్ధం చేసుకోవాలని సైతం సూచించింది. ఇంకోవైపు అన్నదాత సుఖీభవకు కసరత్తు చేస్తోంది. ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వ సాయంతో కలుపుకొని 20000 రూపాయలు అందించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మహిళలకు సంబంధించి నెలకు 1500 రూపాయల నగదు అందించనుంది. అంతకంటే ముందే ఉచిత బస్సు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి విధివిధానాలను ప్రకటించనుంది. ఆగస్టు 15 నుంచి పక్కాగా అమలు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.
అయితే కేవలం పల్లె వెలుగు సర్వీసులకు మాత్రమే ఈ ఉచిత ప్రయాణం వర్తింపజేయనున్నారు. సూపర్ సిక్స్ పథకాల ప్రకటన సమయంలోనే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది. కీలక ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తోంది.