Alla Nani : ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీలో చేరికలు ప్రారంభమవుతున్నాయి.ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.ఆయన రాకను ఏలూరు టిడిపి నేతలు వ్యతిరేకిస్తున్నారు.అయినా సరే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టిడిపిలో చేరుతున్నారు. ఇప్పటికే ఏలూరు టిడిపి నేతలకు హై కమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఆళ్ల నాని సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నేత. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం ఉన్నారు. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీ వెంట నడిచారు. ఈ ఎన్నికల ఫలితాలు తర్వాత వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే మారిన పరిణామాల క్రమంలో టిడిపిలో చేరాలని భావించారు. కానీ వైసీపీ హయాంలో ఆయన డిప్యూటీ సీఎం గా వ్యవహరించారు. ఆ సమయంలో దూకుడుగా ఉండేవారు. అందుకే టిడిపి శ్రేణులనుంచి అభ్యంతరాలు. అయితే అధినేత చంద్రబాబు సముదాయించడంతో వారు ఒప్పుకున్నారు. దీంతో నాని టిడిపిలో చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
* నాలుగుసార్లు ఎమ్మెల్యేగా
ఆళ్ల నాని ఏలూరు అసెంబ్లీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం హోదాను పొందారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు నాని.2004 ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.2009లో రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అటు తరువాత జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఆళ్ల నానికి మంత్రి పదవి దక్కింది. మంత్రితో పాటు డిప్యూటీ సీఎం హోదాను సైతం దక్కించుకున్నారు. కానీ విస్తరణలో ఆయన పదవిని కోల్పోయారు. చివరకు ఎమ్మెల్యే గానే కొనసాగారు.ఈ ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయారు.
* జనసేనలో చేరుతారని
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆళ్ల నాని కీలక ప్రకటన చేశారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే ఆయన జనసేనలో చేరతారని ప్రచారం నడిచింది. కాపు నేత కావడం, ఆయన విషయంలో పవన్ కళ్యాణ్ కు సాఫ్ట్ కార్నర్ ఉండడంతో.. తప్పకుండా ఆళ్ల నాని జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది.అయితే విజయనగరం జిల్లాకు చెందిన టిడిపి నేత ఒకరు ఆళ్ల నానికి అత్యంత ఆప్తులు.ఆయన చొరవతోనే ఆళ్ళ నాని టిడిపికి దగ్గరైనట్లు తెలుస్తోంది. అయితే మంత్రిగా ఉన్నప్పుడు ఆళ్ల నాని దూకుడుగా వ్యవహరించారు. ఆయన క్షమాపణలు చెప్పిన తరువాతనే తెలుగుదేశం పార్టీలో చేరాలని ఏలూరు టిడిపి శ్రేణులు డిమాండ్ చేశాయి. అయితే హై కమాండ్ ఆదేశాలతో సమ్మతించాయి. ఈరోజు మంత్రివర్గ సమావేశం అనంతరం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టిడిపిలో చేరుతారని తెలుస్తోంది.