Amravati
Amravati: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణం పై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ జంగిల్ క్లియరెన్స్ ప్రారంభం అయింది. ఐదేళ్ల కిందట ప్రారంభించిన నిర్మాణాలు కావడంతో నిపుణులు పరిశీలించారు. వారు ఇచ్చిన నివేదికలు ఆధారంగా పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ముఖ్యంగా ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం ర్యాఫ్ట్ ఫౌండేషన్ సమీపంలో భారీ గుంతల్లో ప్రస్తుతం నీటిని తోడేస్తున్నారు. భారీ మోటార్ల సాయంతో నీటిని తోడుతుండగా.. పెద్ద ఎత్తున చేపలు బయటపడుతున్నాయి. ఈ చేపల కోసం స్థానికులు ఎగబడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఐదు వందల కిలోల వరకు చేపలు దొరికినట్లు తెలుస్తోంది. కొన్ని చేపల్ని మార్కెట్లకు కూడా తరలించారు. అయితే గత ఐదు సంవత్సరాలుగా అమరావతి ఏ స్థాయిలో నిర్వీర్యం చేశారో అర్థం అవుతోంది. కనీస స్థాయిలో చర్యలు చేపట్టక పోగా.. ఒక చిట్టడివిలా ఆ ప్రాంతాన్ని మార్చేశారు. ఏకంగా 33 వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులకే 32 కోట్ల రూపాయలు కేటాయించాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
* ఐదేళ్లుగా నిర్లక్ష్యం
2014లో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. పలు భవనాల పనులు మొదలుపెట్టింది. కొన్ని భారీ నిర్మాణాల కోసం.. భారీగా గుంతలు తవ్వి పనులు మొదలుపెట్టారు. సచివాలయానికి సంబంధించి ఐకానిక్ భవనాల కోసం అప్పుడే ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం నిలిచిపోయింది. దీంతో పునాదుల కోసం తవ్విన గుంతల్లో వర్షపు నీరు చేరింది. ఆ ప్రాంతమంతా చెరువులను తలపించాయి. అదే సమయంలో రాజధాని నిర్మాణాలను పరిశీలించేందుకు నిపుణుల బృందాలు అమరావతికి వచ్చాయి. పడవల సాయంతో ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అయితే ఇప్పుడు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతుండడంతో.. ఆ ప్రాంతంలో ఉన్న నీటిని మోటార్ల సాయంతో బయటకు తోడిస్తున్నారు. గత నెల రోజుల నుంచి ఈ పనులు సాగుతున్నాయి. నీటిని సమీపంలోని పాల వాగులోకి పంపిస్తున్నారు. అక్కడ నుంచి నీటిని పక్కనే ఉన్న కృష్ణా నదిలో వదులుతున్నారు.
* ఎగబడుతున్న జనం
ఈ క్రమంలో చేపలు( fishes ) బయటపడుతుండడంతో స్థానికులతో పాటు మత్స్యకారులు అక్కడకు చేరుతున్నారు. చేపలు పట్టి విక్రయిస్తున్నారు. ఇలా పట్టుబడుతున్న చేపలు భారీ సైజులో ఉన్నాయి. బొచ్చ, రాగండి వంటి రకాల చేపలు కావడంతో కొనుగోలు చేసేందుకు స్థానికులు సైతం ఆసక్తి చూపుతున్నారు. మరికొందరైతే గుంతల్లో దిగి చేపలు పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు 500 కిలోల వరకు చేపలు దొరికినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అమరావతిలో పట్టుబడిన చాపలు విజయవాడ మార్కెట్ కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
* సోషల్ మీడియాలో
అయితే దీనిపై సోషల్ మీడియాలో( social media) రకరకాల ప్రచారం నడుస్తోంది. ఇటువంటి ప్రాంతంలో అమరావతిని ఎంపిక చేశారు అంటూ వైసిపి అనుకూల సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే గత ఐదు సంవత్సరాలుగా పట్టించుకోకపోవడంతోనే వర్షపు నీరు చేరింది అంటూ టిడిపి అనుకూల మీడియా చెబుతోంది. మొత్తానికి అయితే అమరావతిలో ఈ చేపల వేట అనేది సరికొత్త ఆసక్తికర అంశంగా మారింది. అమరావతి చాపలు అంటూ కొందరు మత్స్యకారులు, వ్యాపారులు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు.