BJP Vs YS Jagan : నాటి యూపీఏ గవర్నమెంట్ ను జగన్ విభేదించారు. బలీయమైన శక్తిగా ఉన్న సోనియా గాంధీని ఎదురెళ్లారు. ఆగ్రహానికి గురై కేసుల పాలయ్యారు. అయితే జైలుపాలయ్యారు కానీ.. తనకు తానుగా ఒక నాయకుడిగా ఎదిగేందుకు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు, జనాల్లో సానుభూతి దక్కించేందుకు జైలు జీవితం ఎంతగానో ఉపయోగపడింది. శక్తివంతమైన కేంద్రాన్ని ఢీకొట్టారన్న ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. అయితే ఇదంతా కేవలం యూపీఏ గవర్నమెంట్ పైనే. కానీ ఎన్డీఏ విషయంలో మాత్రం ఆయన జాగ్రత్తగానే మసులుకున్నారు. బీజేపీ విషయంలో జగన్ ఎపుడూ ఎక్కడా ఎలాంటి కామెంట్స్ చేసి ఎరగరు. కానీ ఇప్పుడు అనూహ్యంగా విమర్శించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.
వాస్తవానికి 2014 ఎన్నికల సమయంలో మోదీ, చంద్రబాబులు స్నేహితులు. నాడు సోనియాగాంధీని విభేదించి వైసీపీని ఏర్పాటుచేశారు. ఆ సమయంలో సోనియాను, బీజేపీకి సమదూరం పాటించారు. కానీ మోదీ, అమిత్ షాలను నేరుగా ఎపుడూ విమర్శించింది లేదు. 2018లో టీడీపీ ఎన్డీఏకు దూరమైన తరువాత జగన్ మోదీ, షా ద్వయం పట్ల వీరవిధేయత ప్రదర్శించారు. 2019లో అధికారం చేతిలో పడ్డాక ఆయన కేంద్రంతో చాలా పెద్ద ఎత్తున సఖ్యతను నెరిపారు. కేంద్రం సహకారం అవసరం అన్నారు. పేచీ పడి ఏమీ తెచ్చుకోలేము కదా అని పెద్ద తరహా రాజకీయాన్నే ఆయన చేస్తూ వచ్చారు అలా నాలుగేళ్ళ కాలం గడచింది. ఇపుడు ఎన్నికల సీజన్ స్టార్ట్ అయింది.
ఎన్నికలు సమీపించేసరికి బీజేపీ ఏపీలో పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రాంతీయ పార్టీల రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. తమకేంటి అన్న రీతిలో వ్యవహరిస్తోంది. ఇప్పటివరకూ స్నేహం కొనసాగించిన వైసీపీతో పొత్తు పెట్టుకుంటామంటే కుదరని పనిగా భావిస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి పట్టున్న వర్గాలు దూరమయ్యే చాన్స్ ఉంది. ఎస్సీ మైనార్టీలలో వైసీపీ పట్టు పోతుంది. అందుకే జగన్ నో అని చెబుతుండగా.. చంద్రబాబు రండి అంటూ ఆహ్వానం పలుకుతున్నారు. దీంతో అవసరం కోసం బీజేపీ వైసీపీని కాదని టీడీపీ వైపు చూస్తున్నట్టు అగ్రనేతలు సంకేతాలు ఇస్తున్నారు.
అందుకే ఇన్నాళ్లూ స్నేహం చేసిన బీజేపీ అగ్రనేతలు పట్టుబిగించడం ప్రారంభించారు. అమిత్ షా, జేపీ నడ్డాలు జగన్ పై విరుచుకుపడడం ప్రారంభించారు. ఎంతయినా ఢిల్లీ పీఠాన్ని ఎదిరించిన చరిత్ర ఉన్న జగన్ ఫస్ట్ టైమ్ బీజేపీపై స్పందించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. లేకుంటే తన చేతకానితనం బయటపడే అవకాశం ఉంది. అందుకే ప్రజల ముందు కొత్త వాదనను తెరపైకి వచ్చారు. సుతిమెత్తని మాటలను బయటపెట్టారు.
తనకు బీజేపీ అండ కూడా లేదంటూ జగన్ జనం ముందే చెప్పుకున్నారు. తాను ఎల్లో మీడియా విష ప్రచారం మీద అలాగే అవినీతి అక్రమాల మీద పోరాడుతున్నానని చెప్పారు. ఈ పోరాటంలో తనకు ఎల్లో మీడియా ఎదురు నిలిచించని టీడీపీ దత్తపుత్రుడు కూడా తనకు పూర్తిగా ప్రత్యర్ధులు అన్నారు. ఇపుడు వారితో పాటు బీజేపీ కూడా అండ తనకు లేదని జగన్ చెప్పుకొచ్చారు. తాను పూర్తిగా దేవుడిని జనాలను నమ్ముకున్నానని జగన్ తేల్చేశారు.తనకు జనం ఆశీస్సులు దేవుడి దీవెనలు ఉంటే చాలని జగన్ పేర్కొన్నారు. మొత్తానికి జగన్ నోటి వెంట బీజేపీ అండ లేదు అన్న మాట రావడం అంటే బీజేపీ టీడీపీ పొత్తులకు ఇండైరెక్ట్ గా కన్ ఫర్మ్ చేసినట్లే అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.