TDP Janasena First List: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ, జనసేన పార్టీలు శనివారం తమ అభ్యర్థుల తొలి జాబితాలో ఉమ్మడిగా శనివారం ప్రకటించాయి. మొత్తం 175 స్థానాలకు గాను టీడీపీ 151 స్థానాల్లో, జనసేన 24 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈమేరకు పొత్తు ఖరారైనట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తుకు వస్తే టీడీపీ సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే శనివారం టీడీపీ 94 స్థానాలకు, జనసేన 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి.
సీనియర్లకు దక్కని ఛాన్స్..
తాజాగా టీడీపీ 94 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో సీనియర్లకు, సిట్టింగులకు ఛాన్స్ దక్కలేదు. దీంతో చంద్రబాబు ప్లాన్ ఏంటి అన్నది అంతుచిక్కడం లేదు. తాజా జాబితాలో 23 మంది కొత్తవారికి టికెట్ ఇచ్చారు. సామాజిక సమీకరణల ఆధారంగా, సర్వే ఫలితాల ఆధారంగా, సుదీర్ఘ కసరత్తుతో ఈ జాబితా రూపొందించినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఇక తొలి జాబితాలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు.
సీనియర్లను పక్కనపెట్టడంపై చర్చ..
గతంలో సిట్టింగులందరీకి టికెట్ ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. కానీ, తొలి జాబితాలో సీనియర్లను పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదనపై విముఖంగా ఉన్నారు. ప్రస్తుతం గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాక నార్త్ పొత్తులో భాగంగా బీజేపీ లేదా జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. అందుకే గంటాకు టికెట్ ఖరారు చేయలేదని తెలుస్తోంది.
టికెట్ దక్కని సీనియర్లు వీరే..
– పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి సీటుపై కూడా వివాదం కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్ సీటు పొత్తులో జనసేనకు ఖరారైందని చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు జాబితాలో అభ్యర్థిని టీడీపీ, జనసేన ఖరారు చేయలేదు. బుచ్చయ్యతోపాటు కందుల దుర్గేష్‌కు సర్దుబాటు ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
– ఇక రాజమండ్రి సీటు నుంచి ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆదిరెడ్డి వాసుకు టికెట్ ఇచ్చారు. దెందులూరు టీడీపీ నేత చింతల ప్రభాకర్‌కు తొలి జాబితాలో టికెట్ దక్కలేదు. ఆయనకు సీటు దక్కదని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్ర ఇదేవినేని ఉమ్మకు కూడా జాబితాలో స్థానం లేదు. మైలవరం నుంచి ఉమ టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ ఎంట్రీతో ఆయనకే సీటు ఇస్తారని తెలుస్తోంది. ఉమను పెనమలూరుకు మర్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ బోడే ప్రసాద్ సీటు తనదే అని అంటున్నారు. ఇక పల్నాడు టీడీపీ ముఖ్యనేతగా ఉన్న యరపతినేటికి కూడా జాబితాలో ఛాన్స్ దక్కలేదు. అక్కడ వైసీపీ నుంచి వచ్చిన జంగా కృష్ణమూర్తి టికెట్ ఆశిస్తున్నారు. ఆయన ఈనెల 26న టీడీపీలో చేరతారని తెలుస్తోంది. జంగాకు గురజాల, నర్సరావుపేటలో ఏదో ఒకటి ఇస్తారని తెలుస్తోంది. దీంతో యరపతినేటి స్థానం పెండింగ్‌లో ఉంచారు. నెల్లూరు సీనియర్ నేత సోమిరెడ్డి, వైసీసీ నుంచి టీడీపీలో చేరిన ఆనం పేర్లు కూడా జాబితాలో లేవు. వేమిరెడ్డి టీడీపీలో చేరిన తర్వాత వారి స్థానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీలో అధికారికంగా చేరకుండానే నూజివీడు నుంచి వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి పేరు ఖరారైంది. తొలిజాబితాలో టికెట్ దక్కని నేతలు పార్టీలో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.