Liquor Scam Investigation ED India: మద్యం కుంభకోణంపై( liquor scam ) ఈడి జూలు విదిల్చింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక పాత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు కృష్ణమోహన్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తో పాటు ఇతర నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. నేరుగా ఈడీ రంగంలోకి దిగడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
* కేంద్ర దర్యాప్తు ఎంట్రీ..
వైసిపి ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగింది. భారీ ఎత్తున అవినీతి జరిగింది. వేలకోట్ల మనీ లాండరింగ్( money laundering ) జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. గత కొద్ది రోజులుగా విచారణ చేపట్టిన సిట్.. మద్యం సేకరణతో పాటు పంపిణీలు భారీగా అక్రమాలు జరిగాయని తన నివేదికలో స్పష్టం చేసింది. సుమారు నాలుగువేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విచారణ సంస్థ ఈడి రంగంలోకి దిగింది. గత మార్చి నెలలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి, మాజీ ఎండి వాసుదేవరెడ్డి తో పాటు ఇతర నిందితులకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పుడు ఏకంగా నిందితుల ఇళ్లతోపాటు కార్యాలయాల్లో సోదాలు జరపడం విశేషం.
* సాయి రెడ్డికి తప్పని సోదాలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి( Vijaya Sai Reddy ) ఈడి షాక్ ఇచ్చింది. ఎందుకంటే మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారినట్లు ప్రచారం నడిచింది. ఆయన ఇచ్చిన సమాచారం తోనే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. అందుకే ఆయన అరెస్టు విషయంలో మినహాయింపు లభించింది. దీంతో ఆయనపై ఎటువంటి చర్యలు ఉండవని అంతా భావిస్తున్నారు. సరిగ్గా ఎటువంటి సమయంలోనే ఈడి నేరుగా ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా విజయసాయిరెడ్డి నివాసంతో పాటు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది.
* చెవిరెడ్డి పరారీ..
మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( Bhaskar Reddy ) ఈడికి జలక్ ఇచ్చారు. అధికారులు సోదాలకు వస్తున్నారని తెలిసి ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా కనిపించకుండా మానేశారు. తుమ్మలగంటలోని ఆయన ఇంట్లో ఉండే చెవిరెడ్డి మూడు రోజుల కిందట ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కనిపించకుండా మానేశారు. కనీసం ఆయన ఎక్కడకు వెళ్లారో కూడా బయటకు సమాచారం ఇవ్వలేదు. ఫోన్ లకు కూడా స్పందించడం లేదు. మొత్తానికైతే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం కుంభకోణంపై ఫోకస్ పెట్టింది. ఇకనుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ మరింత దూకుడుగా ముందుకెళ్ళనుంది.