Duvvada Srinivas: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలోకి వచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. కారణం ధర్మాన ప్రసాదరావు. దువ్వాడ శ్రీనివాస్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు అని ఆయన తేల్చి చెబుతున్నారట. కేవలం ధర్మాన బ్రదర్స్ మాత్రమే కాదు శ్రీకాకుళం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా దువ్వాడ శ్రీనివాస్ విషయంలో అదే అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే దువ్వాడ వస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని తమను తక్కువ చేసి చూస్తారు అన్నది మిగతా నేతల వాదన. ఒక్క ధర్మాన ప్రసాదరావు విషయంలోనే మాత్రమే కాదు.. ఆయన సోదరుడు కృష్ణదాసుతో కూడా దువ్వాడ శ్రీనివాస్ కు విభేదాలు ఉన్నాయి. మంత్రిగా వ్యవహరించిన డాక్టర్ అప్పలరాజును కూడా ఆయన లెక్క చేయలేదు. పైగా పక్క నియోజకవర్గాలకు చెందిన నేతలతో కూడా ఆయనకు సఖ్యత లేదు. అందుకే దువ్వాడ శ్రీనివాస్ విషయంలో శ్రీకాకుళం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏకతాటి పైకి వచ్చింది. ఆయన విషయంలో ఎవరు సిఫార్సు చేసినా పార్టీలోకి తీసుకోవద్దన్నది జగన్మోహన్ రెడ్డి వద్ద ప్రతిపాదనగా తెలుస్తోంది.
* జగన్ ప్రభంజనంలోనూ ఓటమి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శ్రీకాకుళం జిల్లాలో ఒకే ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు అక్కడ ప్రజలు. 2019లో అయితే ఏకపక్ష విజయం అందించారు ఆ పార్టీకీ. ఆ సమయంలో సైతం దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయారు. ఆ ఓటమిని ధర్మాన బ్రదర్స్ పై వేశారు దువ్వాడ. జగన్ ప్రభంజనంలో సాధారణ సర్పంచులు సైతం పోటీ చేసి గెలిచారు ఆ ఎన్నికల్లో. కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం టెక్కలిలో ఓడిపోయారు. కేవలం మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డికి దగ్గరైన ఆయన ఎమ్మెల్సీ పదవి పొందారు. అయితే జగన్ పట్ల విధేయత చూపించవచ్చు కానీ శ్రీకాకుళం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మాత్రం దువ్వాడ శ్రీనివాస్ వైఖరి నచ్చదు. తన వ్యక్తిగత వ్యవహార శైలితో పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెట్టారు కనుక దువ్వాడ శ్రీనివాస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచనకు వచ్చారు. అందుకే పార్టీ నుంచి దూరం పెట్టారు. కానీ ఎలాగైనా వైసీపీలోకి వస్తానని ధీమాతో ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్..
* శ్రీకాకుళం క్యాడర్ ది అదే మాట…
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి జై కొడతారే తప్ప.. తిరిగి ధర్మాన బ్రదర్స్ తో పాటు మిగతా వైయస్సార్ కాంగ్రెస్ నేతలకు ఆయన కచ్చితంగా గొడవ పెట్టుకుంటారు. దువ్వాడ శ్రీనివాస్ పార్టీలోకి వస్తే లాభం కంటే నష్టం అధికమని ధర్మాన బ్రదర్స్ జగన్ వద్ద వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. తాము ఒక్కరిమే కాదు జిల్లాలో వైసీపీ క్యాడర్ అంతా దువ్వాడ శ్రీనివాసును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మిగతా నాయకులతో సైతం దువ్వాడ వైఖరిని జగన్మోహన్ రెడ్డికి చెప్పే ప్రయత్నం కూడా చేశారు. టెక్కలి అసెంబ్లీకి పేరాడ తిలక్ రూపంలో అభ్యర్థి సిద్ధంగా ఉన్నారని.. రాష్ట్రస్థాయి నాయకులు సిఫారసు చేసిన దువ్వాడ శ్రీనివాసును పార్టీలోకి తీసుకోవద్దని సూచించారట ధర్మాన బ్రదర్స్. మొన్నటికి మొన్న అసెంబ్లీలో ఎదురుపడిన దువ్వాడను పిలిచి మాట్లాడారు. త్వరలో వచ్చి కలుస్తానని దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకొచ్చారు అప్పట్లో. కానీ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదన్న పరిస్థితి చూస్తుంటే దువ్వాడ శ్రీనివాస్ కు డోర్స్ క్లోజ్ అయినట్టే. ఈ విషయంలో మాత్రం ధర్మాన బ్రదర్స్ కొంత సక్సెస్ అయినట్టే కనిపిస్తున్నారు.