UAE Investment In AP: ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడింది. అందులో కొంత వరకు సక్సెస్ కనిపిస్తోంది. వచ్చే నెలలో విశాఖలో పెట్టుబడుల సదస్సు జరగనుంది. భారీగా పెట్టుబడులు తెచ్చే క్రమంలో ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు నారా లోకేష్. అక్కడ పారిశ్రామికవేత్తలతో రోడ్ షో కూడా నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటనలో ఉన్నారు. పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి సానుకూల స్పందన రావడం విశేషం. మూడు రోజుల పర్యటన నిమిత్తం నిన్ననే దుబాయ్ వెళ్లారు సీఎం చంద్రబాబు. మూడు రోజులపాటు బిజీ బిజీగా గడపనున్నారు.
* ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో వేయి కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని.. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైలు కనెక్టివిటీ ఉండేలా బహుళ ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మించే దిశగా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించింది ట్రాన్స్ వరల్డ్ గ్రూప్. ఏపీలో షిఫ్ట్ బిల్డింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపింది. లాజిస్టిక్స్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇది ఎంతగానో దోహద పడనుంది.
* బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ చైర్మన్ సంషీర్ వయాలీల్ తో సైతం చంద్రబాబు భేటీ అయ్యారు. అబుదాబిలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహిస్తోంది బుర్జిల్ సంస్థ. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపింది. తిరుపతిలో అత్యాధునిక స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చింది.
* రేపటి వరకు అక్కడే..
రేపటి వరకు గల్ఫ్ దేశాల్లో ఉండనున్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో పెట్టుబడుల సదస్సుకు పెద్దఎత్తున పారిశ్రామికవేత్తలను రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. నేరుగా అక్కడే ఒప్పందాలు చేసుకొని పరిశ్రమల కార్యకలాపాలు ప్రారంభించేలా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. మూడు రోజుల పర్యటన ముగించుకొని రేపు ఏపీకి రానున్నారు సీఎం చంద్రబాబు.